జూన్ 1న కేరళను తాకనున్న రుతుపవనాలు.. రైతులకు గుడ్ న్యూస్
ఎండాకాలంలో భానుడి తాకిడి అలమటిస్తున్న జనాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంకా ఇది రైతులకు శుభవార్త కూడా కానుంది. అనుకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు పేర్కొంది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని అంచనా వేసింది.
అయితే, ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎం.రాజీవన్ పేర్కొన్నారు.
రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకే అవకాశం ఉందని ముందస్తు విశ్లేషణలు సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇది సాధారణ రుతుపవన ఏడాది అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు రాజీవన్ వెల్లడించారు.
దీర్ఘకాలిక సగటు (ఎల్‌పీఏ)లో ఈ ఏడాది 98 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఏప్రిల్ 16న భారత వాతావరణశాఖ తన ముందస్తు సూచనలో పేర్కొంది. ఈ అంచనాల్లో 5 శాతం అటూఇటుగా ఉండే అవకాశం ఉందని వివరించింది.