జయమ్మ అక్క అయితే ప్రధాని మోదీ తమ్ముడు.. చెప్పిందెవరంటే?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్క అయితే, ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు అని, వారి ఆశయాలు నెరవేర్చేలా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ అధికార ప్రతినిధి సీటీ రవి పిలుపునిచ్చారు. తేని జిల్లా బోడినాయకనూరు నియోజకవర్గ అభ్యర్థి, అన్నాడీఎంకే సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంకు మద్దతుగా సీటీ రవి ప్రచారం చేపట్టారు.
ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం ప్రధాని, రాష్ట్రాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి జయలలిత శ్రమించారని అన్నారు. జయలలిత అక్క అయితే, ప్రధాని మోదీ తమ్ముడు లాంటి వారని, వారి కలలు, ఆశయాలు నెరవేర్చేలా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఆయన అభ్యర్థించారు. ఈ సందర్భంగా సీటీ రవి, అభ్యర్థి ఒ.పన్నీర్‌సెల్వంకు కార్యకర్తలు వెండి శూలాయుధాన్ని బహుమతిగా అందజేశారు.