మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (20:29 IST)

జనాలు చస్తున్నా.. ప్రధాని మోడీకి ఈగోనే ముఖ్యం : రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ దెబ్బకు దేశంలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రధాని మోడీకి మాత్రం ఈగోనే ముఖ్యమని ఆరోపించారు. 
 
దేశ‌మంతా క‌రోనా మ‌హ‌మ్మారితో అల్లాడుతుంటే కేంద్రం సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుపై ముందుకెళ్ల‌ాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. ఈ నిర్ణయంపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నారు. వారిలో ఇపుడు రాహుల్ గాంధీ కూడా చేరారు. 
 
ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ 13,450 కోట్ల‌ను 45 కోట్ల మంది దేశ ప్ర‌జ‌ల‌కు వ్యాక్సిన్ వేసేందుకు లేదా ఒక కోటి ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను సేక‌రించేందుకు వెచ్చించ‌వ‌చ్చ‌న్నారు. 
 
సెంట్ర‌ల్ విస్టా రీడెవ‌ల‌ప్మెంట్ ప్రాజెక్టు కింద ప‌లు నిర్మాణాల‌కు ప‌ర్యావ‌ర‌ణ మంత్రిత్వ శాఖ నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన నేప‌థ్యంలో రాహుల్ ఈ మేర‌కు ట్వీట్ చేశారు. 
 
అంతేకాకుండా, దేశంలో మంగళవారం కూడా 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ పరిస్థితి తీవ్రతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అర్థం చేసుకోవడంలేదని ఆయన విచారం వెలిబుచ్చారు. 
 
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ఇప్పుడు సంపూర్ణ లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గమని రాహుల్ స్పష్టం చేశారు.
 
లాక్డౌన్‌తో ప్రభావితమయ్యే వర్గాలను 'న్యాయ్' పథకం కిందకు తీసుకురావాలని సూచించారు. న్యాయ్ ప‌థ‌కం కింద రెండు కోట్ల కుటుంబాల‌కు రూ.6000 కోట్లు అంద‌చేయ‌వ‌చ్చ‌ని సూచించారు.
 
కేంద్రం నిర్లక్ష్య వైఖరి అనేకమంది అమాయక ప్రజలను చంపేస్తోందని విమర్శించారు.  అయితే ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ప్రధాని ఈగోనే అధికమ‌ని ఎద్దేవా చేశారు.