శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2024 (11:01 IST)

జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు కాగితం ఎలా వచ్చిందబ్బా?

arvind kejriwal
ఢిల్లీ మద్యం స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన సాగిస్తున్నారు. పైగా, తమ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తన సహచర మంత్రికి ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా పరిగణిస్తుంది. కస్టడీ సమయంలో ప్రధాన కార్యాలయంలో ఉన్న కేజ్రీవాల్‌కు కంప్యూటర్‌ లేదా కాగితాలను తాము సమకూర్చలేదని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఆదేశాలు బయటకు ఎలా వెళ్లాయో తెలుసుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆదేశాలు పేర్కొన్న కాగితం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకొనేందుకు ఆప్‌ మంత్రి ఆతిశీని ఈడీ ప్రశ్నించనుంది. దీంతో పాటు జైల్లో కేజ్రీవాల్‌ కదిలికలను గమనించేందుకు సీసీ టీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని చెబుతున్నారు.
 
మరోవైపు, జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండటం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కస్టడీ నుంచి ఆయన ఇచ్చిన ఆదేశాలపై ఈడీ దర్యాప్తు చేపట్టగా.. ఇదే సమయంలో తాజాగా సీఎం మరోసారి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. మంగళవారం ఉదయం లాకప్‌ నుంచి కేజ్రీవాల్‌ రెండో ఆదేశాలు జారీ చేసినట్లు ఆప్‌ నేత, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ వెల్లడించారు. మొహల్లా క్లినిక్‌లలో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూసుకోవాలని సీఎం ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు. 'కస్టడీలో ఉన్నప్పటికీ సీఎం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు' అని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఏం చేయాలో తెలియక లోతుగా విచారణ జరిపేందుకు చర్యలు చేపట్టింది.