శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (10:05 IST)

20 తర్వాత ఆంక్షలు సడలింపు.. ఆ విధానంలో వాహనాలకు అనుమతి : కేరళ

కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తోంది. ఈ లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకు అమల్లోవుండనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపు ఉంటుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంటున్నారు. పైగా, రాష్ట్రంలో సరి - బేసి సంఖ్యా విధానంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, నిబంధనల సడలింపు పాక్షికంగానే ఉంటుందని స్పష్టం చేసిన ఆయన, మహిళలు నడిపే వాహనాలకు మాత్రం ఏ రోజైనా అనుమతిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని కరోనా బాధిత జిల్లాలలను నాలుగు జోన్లుగా విభజించి, లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరినట్టు పినరయి వెల్లడించారు. 
 
కరోనా కేసులు అధికంగా ఉన్న కసర్ గోడె, కానూరు, మలప్పురం, కోజికోడ్ జిల్లాలు తొలి జోన్‌లో ఉంటాయని, ఇక్కడ లాక్‌డౌన్ నిబంధనలకు ఎటువంటి మినహాయింపూ ఉండబోదని, మే 3 వరకూ ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాయించాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 
 
ఆపై పథనంతిట్ట, ఎర్నాకులం, కొల్లాం రెండో జోన్‌లో ఉంటాయని, ఇక్కడి హాట్ స్పాట్‌లను గుర్తించి, వాటిని సీల్ చేస్తామని తెలిపారు. అలపుళ, తిరువనంతపురం, పాలక్కాడ్, త్రిసూర్, వాయనాడ్ జిల్లాలు మూడో జోన్‌లో ఉంటాయని, ఈ ప్రాంతంలో నిబంధనలకు కొంతమేరకు సడలిస్తామని తెలిపారు. 
 
ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదుకాని కొట్టాయం, ఇడుక్కి జిల్లాలు నాలుగో జోన్‌లో ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. కాగా, కేరళలలో గురువారం సాయంత్రానికి 394 కేసులు ఉండగా, 147 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 245 మంది చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రెండు మరణాలు చోటుచేసుకున్నాయి.