సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 మే 2024 (16:17 IST)

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతుంది : ప్రధాని మోడీ

narendra modi
రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయాలని శత్రుదేశం పాకిస్థాన్ తహతహలాడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా పాకిస్థాన్ ప్రధానిపై రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురిపంచారు. దీంతో రాహుల్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రధాని మోడీ సైతం ఘాటుగా స్పందించారు. హస్తం పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ యువరాజు కోసం పాకిస్థాన్ నేతలు ప్రార్థిస్తున్నారని ఆరోపించారు. వారి మధ్య బంధం తేటతెల్లమైందని అన్నారు.
 
గుజరాత్‌లోని ఆనంద్‌ ప్రాంతంలో మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పాక్‌ ప్రశంసల అంశాన్ని ప్రస్తావించారు. 'దేశంలో కాంగ్రెస్‌ నానాటికీ బలహీనపడుతోంది. ఇక్కడ ఆ పార్టీ అస్థిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్‌ కన్నీళ్లు పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌ యువరాజును (రాహుల్‌ను ఉద్దేశిస్తూ) భారత ప్రధానిని చేయాలని దాయాది తహతహలాడుతోంది. ఆ పార్టీ పాక్‌కు అభిమాని అని మనకు తెలుసు. ఇప్పుడు వారి మధ్య భాగస్వామ్యం పూర్తిగా బయటపడింది' అని మోడీ దుయ్యబట్టారు.
 
'భారత్‌లో బలహీన ప్రభుత్వం ఉండాలని మన శత్రువులు కోరుకుంటున్నారు. 26/11 ముంబై దాడుల నాటి ప్రభుత్వం, 2014కు ముందున్న సర్కారు మళ్లీ అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. అందుకే కాంగ్రెస్‌ కోసం పాక్‌ నేతలు ప్రార్థిస్తున్నారు' అని మోడీ మండిపడ్డారు. 
 
పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్‌ హుస్సేన్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ఖాతాలో రాహుల్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత ప్రసంగించిన వీడియోను షేర్‌ చేసి.. ‘రాహుల్‌ ఆన్ ఫైర్‌’ అని రాసుకొచ్చారు. దీనిపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.