ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్‌ను అస్థిరపరిచేందుకు పాకిస్థాన్ కుట్ర : రాజ్‌నాథ్ సింగ్

కాశ్మీర్ అంశాన్ని అడ్డుపెట్టుకుని భారత్‌ను అస్థిర పరిచేందుకు పాకిస్థాన్ నిరంతరం కుట్ర పన్నుతోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ఆయన ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన భద్రతా సిబ్బందితో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, 26/11 దాడులను తామెవ్వరం మరచిపోలేదన్నారు. అటువంటి చర్యలు దేశంలో ఇంకోసారి పునరావృతం కావన్నారు. నేవీ, కోస్ట్ గార్డ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. ఈ దఫా పాకిస్థాన్ తోకజాడిస్తే మాత్రం ఖచ్చితంగా పీచమణుస్తామని హెచ్చరించారు. 
 
మరోవైపు, చైనాపై భారత్ మండిపడింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ)లో చైనా కాశ్మీర్ అంశాన్ని ఏకపక్షంగా ప్రస్తావించడాన్ని ఖండించింది. చైనా దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, కాకశ్మీర్‌ సమస్య గత కొన్నేండ్లుగా పరిష్కారం కాకుండా ఉంది. యథాతథ స్థితిలో మార్పులు కలిగించే ఎలాంటి చర్యలనూ ఏకపక్షంగా తీసుకోరాదు అని అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ అభ్యంతరం తెలిపారు. జమ్ము, కాశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని, ఇక్కడ జరిగే పరిణామాలు తమ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. 'పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో అక్రమంగా చేపడుతున్న చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడర్ వంటి వాటికి దూరంగా ఉండాలని మేం కోరుతున్నాం అని చెప్పారు.