శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:05 IST)

‘ ఔను, అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది’: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ అంగీకారం

పాకిస్తాన్ గూఢచర్య సంస్థ.. ఐఎస్ఐ.. అల్‌-ఖైదా మిలిటెంట్ సంస్థకు శిక్షణ ఇచ్చిందని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసిందని ఆయన ఒప్పుకున్నారు. 9/11 దాడుల తర్వాత అమెరికాకు సహకరించి పాకిస్తాన్ పెద్ద తప్పు చేసిందని కూడా ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

 
న్యూయార్క్‌లో 'కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)' అనే ఓ మేధో సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ''నేను ఎదుర్కొన్న అన్ని దేశాల్లోకెల్లా అత్యంత ప్రమాదకరమైంది పాకిస్తానే' అని అమెరికా మాజీ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ గతంలో వ్యాఖ్యానించారు.

 
ఈ అభిప్రాయంపై స్పందన కోరినప్పుడు, ''పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ఎందుకు పెరిగిందో, మాటిస్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారనుకుంటా'' అని ఇమ్రాన్ అన్నారు. 80వ దశకంలో ఏర్పడిన పరిస్థితుల గురించి మాట్లాడారు. ''1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దాడి చేసింది. అమెరికాతో కలిసి పాకిస్తాన్ దీన్ని ప్రతిఘటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను పిలిపించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు సిద్ధం చేసింది. ఇలా మిలిటెంట్ సంస్థలను తయారుచేసింది'' అని ఇమ్రాన్ వివరించారు.

 
అమెరికాకు సహకరించి తప్పు చేశాం
1989లో సోవియట్ సేనలు అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టాయని, ఆ తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిందని ఇమ్రాన్ అన్నారు. అయితే, జిహాదీ బృందాలు తమ దేశంలో ఉండిపోయాయని చెప్పారు. ''9/11 తర్వాత అమెరికాతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడాల్సి వచ్చింది. కానీ, ఈసారి అమెరికా అఫ్గానిస్తాన్ తిరిగి వెళ్లేటప్పటికి.. అంతకుముందు జిహాదీ బృందాలుగా భావించినవి ఉగ్రవాద బృందాలుగా మారిపోయాయి'' అని ఆయన వ్యాఖ్యానించారు.

 
''జిహాద్ కోసం ముందుగా మేం శిక్షణ ఇచ్చిన వాళ్లనే మళ్లీ ఉగ్రవాదులని అన్నాం. 9/11 తర్వాత అమెరికాకు సహకరించి చాలా పెద్ద తప్పు చేశాం. ఈ విషయంలో మేం తటస్థంగా ఉండాల్సిందన్నది నా అభిప్రాయం'' అని ఇమ్రాన్ అన్నారు. ఈ నిర్ణయం కారణంగా పాకిస్తాన్ 150-200 బిలియన్ డాలర్లు నష్టపోయిందని, పెద్ద గుణపాఠం కూడా నేర్చుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

 
''నెరవేర్చలేమనుకున్న హామీని అసలు ఇవ్వనేకూడదు. ఆ మిలిటెంట్ సంస్థలు పాకిస్తాన్ సైన్యానికి సన్నిహితంగా ఉండేవి. ఆ తర్వాత ఆ సైన్యమే వాటిని నాశనం చేయాలని ప్రయత్నించింది'' అని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. 9/11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ పాకిస్తాన్‌లోనే తలదాచుకోవడం గురించి కూడా ఈ కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడారు.

 
అల్‌-ఖైదాకు శిక్షణ ఇచ్చిందే పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ కాబట్టి వారి మధ్య సంబంధాలు ఎప్పుడూ ఉన్నాయని ఇమ్రాన్ అన్నారు. ''మేం జిహాదీలకు శిక్షణ ఇచ్చాం. వాళ్లు గొప్ప పని చేయబోతున్నారని చెప్పాం. మళ్లీ వాళ్లనే ఉగ్రవాదులని అన్నాం. అఫ్గానిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్ వెళ్లాక, అమెరికా ప్యాకప్ చేప్పాక.. మేం ఈ జిహాదీ బృందాల మధ్య ఉండాల్సి వచ్చింది'' అని ఇమ్రాన్ అన్నారు.

 
మిలిటెన్సీని పాక్ పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్, అఫ్గానిస్తాన్ ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో మిలిటెన్సీని అణిచివేయాలన్న ఒత్తిడి పాకిస్తాన్‌పై పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్, అఫ్గానిస్తాన్‌ల వాదనను మరింత బలపరిచేలా ఉన్నాయి.