శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (12:27 IST)

డోనల్డ్ ట్రంప్: ‘నేను పాక్ స్నేహితుణ్ణి.. ఇమ్రాన్ గొప్ప నాయకుడు.. మోదీ ప్రకటన దూకుడుగా ఉంది’

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సోమవారం న్యూయార్క్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనను తాను పాకిస్తాన్‌కు స్నేహితుడిగా అభివర్ణించుకున్న ట్రంప్.. ఇమ్రాన్ ఖాన్ ‘గ్రేట్ లీడర్’ అని చెప్పారు. ఆ సమావేశానికి ముందు ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ ఒక మీడియా సమావేశంలో కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

 
ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, "భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో 59 వేల మంది సమక్షంలో చాలా దూకుడుగా ప్రకటన చేశారు" అని చెప్పారు. "భారత్, ప్రధానమంత్రి మోదీ వైపు నుంచి నిన్న చాలా అగ్రెసివ్ ప్రకటన విన్నాను. నేను అక్కడే ఉన్నాను. నేను అలాంటి ప్రకటన వింటానని అనుకోలేదు. అక్కడున్న వారందరికీ అది బాగానే అనిపించింది. కానీ అది చాలా దూకుడుగా ఉంది" అని ట్రంప్ అన్నారు.

 
నరేంద్ర మోదీ ఆదివారం హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండా "సొంత దేశాన్నే నడపలేని వారికి, భారత్ తీసుకునే నిర్ణయాలతో ఇబ్బంది వస్తోందని, వారు తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారని" చెప్పారు. పాకిస్తాన్, భారత్‌తో కలిసి వస్తామని, రెండు దేశాలకూ ఆమోదయోగ్యంగా ఉండేలా ఏదైనా చేయగలమని ట్రంప్ ఈ సమావేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుందన్న ఆయన, దీనిని కూడా ఏదో ఒకవిధంగా పరిష్కరించవచ్చని అన్నారు.

 
మళ్లీ మధ్యవర్తిత్వానికి సిద్ధం అన్న ట్రంప్
భారత్, పాకిస్తాన్ రెండూ కోరితే, కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేసేందుకు తను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ మరోసారి చెప్పారు. "నన్ను మధ్యవర్తిత్వం చేయమని అడిగితే, నేను సిద్ధంగా ఉన్నాను. అది చేయాలనుకుంటున్నా. నాకు ఆ సామర్థ్యం కూడా ఉంది. ఇది క్లిష్టమైన అంశం. సుదీర్ఘ కాలంగా నడుస్తూ వస్తోంది. రెండు దేశాలూ కోరితే నేను మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాను. కానీ భారత్ సిద్ధం కావడం కూడా అవసరమే" అని ట్రంప్ అన్నారు.

 
"కశ్మీర్‌లో మానవహక్కుల పరిస్థితి గురించి మీరు ఆందోళన చెందుతున్నారా?" అని ఒక జర్నలిస్టు ఆయన్ను అడిగినప్పుడు.. ట్రంప్, "అవును, నేను అక్కడ పరిస్థితి కుదుటపడాలని, అందరితో మంచిగా వ్యవహరించాలనే నేను కోరుకుంటున్నాను" అన్నారు. తీవ్రవాదాన్ని అణచివేయడంలో పాకిస్తాన్ పురోగతి సాధించిందని ట్రంప్ చెప్పారు. "ఇమ్రాన్ ఖాన్ ఆ అంశంలో పురోగతి తీసుకురావాలని కోరుకుంటున్నారు. దానికి వేరే పరిష్కారం ఏదీ లేదు. మరోవైపు అప్పులు, పేదరికం ఉన్నాయి" అన్నారు.

 
ట్రంప్‌కు ఇమ్రాన్ ఖాన్ వినతి
డోనల్డ్ ట్రంప్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి నేతృత్వం వహిస్తున్నారని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. "ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి ఒక బాధ్యత ఉంటుంది. మీరు మధ్యవర్తిత్వం చేస్తామని, దాని కోసం రెండు దేశాలూ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ భారత్ మాతో చర్చలకు నిరాకరిస్తోంది. ఈ పరిస్థితిలో ఇది నాకు ఒక పెద్ద సంక్షోభానికి ప్రారంభం అనిపిస్తోంది" అన్నారు.

 
"నిజాయితీగా చెప్పాలంటే, కశ్మీర్‌లో ఈ సంక్షోభం చాలా పెద్దదవబోతోందని నాకు అనిపిస్తోంది. అమెరికా చాలా శక్తివంతమైన దేశం. అది ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని ప్రభావితం చేయగలదు. అందుకే అమెరికా ఈ అంశాన్ని లేవనెత్తాలని నేను కోరుతున్నాను" అని పాక్ ప్రధాని చెప్పారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇద్దరూ ఐక్యరాజ్యసమితి నేషనల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. ఐక్యరాజ్యసమితి నేతల ఎదుట కశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతానని ఇమ్రాన్ ఖాన్ ఇంతకుముందే చెప్పారు.

 
ట్రంప్-ఇమ్రాన్ ఏం చర్చించారు
ట్రంప్, ఇమ్రాన్ ఖాన్ భేటీ తర్వాత పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ కూడా మీడియాతో మాట్లాడారు. ఇది ముందే నిర్ణయించిన సమావేశం అని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి ఇమ్రాన్, ట్రంప్ మూడు అంశాలపై ఓపెన్‌గా చర్చించుకున్నారని చెప్పారు. "కశ్మీర్, అఫ్గానిస్తాన్, ఇరాన్ అంశాలపై చర్చలు జరిగాయి. కశ్మీర్ పరిస్థితిపై ప్రధానమంత్రి ఇమ్రాన్, అధ్యక్షుడు ట్రంప్‌తో ఓపెన్‌గా మాట్లాడారు. అక్కడ ఒక మానవీయ సంక్షోభం సృష్టించారని ఆయన స్పష్టంగా చెప్పారు. 80 లక్షల మంది బహిరంగ జైలులో ఉన్నారని, వారి ప్రాథమిక హక్కులను కాలరాశారని, పరిస్థితి చేజారిపోతోందని చెప్పారు".

 
"ఒకవేళ భారత్ ఎవరిమాటా వినకపోతే, అమెరికా తన పాత్ర పోషించాల్సి ఉంటుందని కూడా ఆయన ట్రంప్‌ను కోరారు. రెండు దేశాలూ చర్చలకు ముందుకు రావడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందనే విషయంలో ఆయనకు ఎలాంటి సందేహం లేదు. సమస్య పరిష్కారం కావాలంటే, అక్కడ రక్తపాతం ఆగాలంటే.. అమెరికా లేదా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తన పాత్రను పోషించాల్సి ఉంటుంది. దీనిపై అధ్యక్షుడు ట్రంప్‌కు ఇమ్రాన్ ఖాన్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు" అని ఖురేషీ చెప్పారు.

 
ఇరాన్ అంశంపై కూడా చర్చలు జరిగాయని ఖురేషీ చెప్పారు.. "అనాలోచితంగా ఇరాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని, దానివల్ల భయంకర పరిణామాలు ఎదురవుతాయని కూడా ఇమ్రాన్, ట్రంప్‌కు చెప్పారు" అన్నారు.