మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:13 IST)

యుద్ధం కాదు.. బుద్ధుని శాంతిసందేశాన్నిచ్చింది : నరేంద్ర మోడీ

ప్రపంచానికి భారత్ యుద్ధాన్ని ఇవ్వలేదు. శాంతి సందేశాన్నిచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఐక్యరాజ్య సమితి 74వ సర్వసభ్య సమావేశంలో మోడీ అత్యంత కీలక ప్రసంగం చేశారు. "ప్రపంచానికి భారత్‌ యుద్ధాన్ని ఇవ్వలేదు. బుద్ధుడిని ఇచ్చింది. బుద్ధుని శాంతి సందేశాన్నిచ్చింది. అందుకే ఉగ్రభూతానికి వ్యతిరేకంగా భారత్‌ బలంగా గళమెత్తుతున్నది. ఐరాస శాంతి మిషన్లలో ప్రాణాత్యాగం చేసిన జవాన్లలో అత్యధికులు భారత్‌కు చెందినవారే" అని ఆయన గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను యావత్‌ ప్రపంచం జరుపుకుంటున్నదని, ఆయన బోధించిన సత్యం, అహింస సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమన్నారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికోకాకుండా ప్రపంచం మొత్తానికి పెనుముప్పలా పరిణమించిందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఉగ్రవాదం విషయంలో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం.. ఐరాస స్థాపనకు పునాదిగా నిలిచిన సిద్ధాంతాలనే దెబ్బతీస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు నిర్వహించాలని 1996లో భారత్‌ ఒక ముసాయిదా ప్రతిని ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టింది. అయితే సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అది అలాగే మురిగిపోయింది. 
 
అంతేకాకుండా, బహుముఖ ప్రాతినిధ్యానికి, ఐక్యరాజ్యసమితికి సరికొత్త మార్గం చూపాలని అంతర్జాతీయ సమాజానికి సూచించారు. స్వామి వివేకానంద షికాగోలో ఇచ్చిన చారిత్రక ఉపన్యాసాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. 1893లో వివేకానంద ఉపదేశించిన శాంతి, సామరస్యాలే నేటికీ ప్రపంచానికి భారత్‌ ఇస్తున్న సందేశాలని చెప్పారు. 
 
అలాగే తమిళ కవి కనియన్‌ పుంగుంద్రనార్‌ చెప్పిన మాటలను ఉదహరిస్తూ.. మనం అన్ని ప్రాంతాలకు, అందరికీ చెందినవారమని, ఈ అద్వితీయత భారత్‌ సొంతమన్నారు. కాగా, పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో శాంతిభద్రతలు, సుస్థిరతను నెలకొల్పేందుకు దౌత్యం, చర్చలకు భారత్‌ సహకారం అందిస్తుందని గురువారం ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ భేటీ సందర్భంగా ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.