ప్రధాని 72వ పుట్టిన రోజు.. గ్వాలియర్‌లో దిగిన చీతాల ఫ్లైట్
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 72వ పుట్టిన రోజును నేడు జరుపుకుంటున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆయనకు పలువురు పుట్టినరోడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు. దేశ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఈరోజు ప్రధానమంత్రి నాలుగు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యప్రదేశ్‌లోని కునో పాల్పూర్ అభయారణ్యంలో నిర్మించిన క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలో నమీబియా నుండి వచ్చిన చిరుతలను ప్రధాని మోదీ ఈరోజు విడుదల చేయనున్నారు.
కాగా.. నమీబియా నుంచి 8 చీతాలతో బయలుదేరిన బోయింగ్ విమానం బి747 జంబోజెట్ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ల్యాండైంది. చీతాలను తీసుకొచ్చేందుకు విమానాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అధికారులు దాని ముఖాన్ని చీతా బొమ్మతో అందంగా తీర్చిదిద్దారు. గ్వాలియర్ విమానాశ్రయంలో ల్యాండైన విమానానికి అధికారులు స్వాగతం పలికారు.
భూమ్మీద అత్యంత వేగవంతమైన జంతువుగా రికార్డులకెక్కిన చీతాలు మన దేశంలో 1952లో అంతరించిపోయాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇవి భారత గడ్డపై కాలు మోపాయి. చీతాలను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు చీతా ప్రపంచంలోనే తొలి అతిపెద్ద ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్టు కావడం గమనార్హం.