గుండెపోటుతో అంపైర్ అసద్ రవూఫ్ మృతి
పాకిస్తాన్ వివాదాస్పద అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. లాహోర్‌లోని లాండా బజార్‌లో తన బట్టల షాప్ మూసి వేసి ఇంటికి వెళ్లే క్రమంలో ఛాతిలో నొప్పితో అసద్ రవూఫ్ తీవ్రంగా ఇబ్బంది పడగా.. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినట్లు సోదరుడు తాహిర్ తెలిపాడు.
అంపైర్ గా ఒక వెలుగు వెలిగిన అసద్ రవూఫ్.. 2013లో జరిగిన ఐపీఎల్ కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో కూరుకుపోయాడు. బుకీల నుంచి కాస్ట్ లీ బహుమతులు స్వీకరించి అవినీతికి పాల్పడినట్లు బీసీసీఐ విచారణలో తేలింది. దాంతో అసద్ అంపైరింగ్ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అసద్ వయసు 66 సంవత్సరాలు.
రవూఫ్ తన అంపైరింగ్ కెరీర్ ను 1998లో ఆరంభించాడు. 2000లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన వన్డేల్లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాడు.
నాలుగు సంవత్సరాల తరువాత 2004లో రవూఫ్ తొలిసారిగా అంతర్జాతీయ అంపైర్ల ప్యానెల్‌లో చేర్చబడ్డాడు. తన కెరీర్ లో అసద్ 47టెస్టులు, 98వన్డేలు, 23 టీ20లకు అంపైర్‌గా పనిచేశాడు.