ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 సెప్టెంబరు 2022 (08:56 IST)

కర్నాటక రాష్ట్ర మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం

Umesh Katti
కర్నాటక రాష్ట్ర మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం చెందారు. ఆయన బుధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామంత్రిగా ఉన్న ఉమేష్‌కు 61 యేళ్లు. భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగులూరులోని డాలర్ కాలనీలో నివసిస్తున్న ఆయన మంగళవారం రాత్రి బాత్రూమ్‌లో కాలుజారి కిందపడి గుండెపోటుకు గురయ్యాడు. ఆ వెంటనే ఆయన్ను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయనలో పల్స్ పడిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా, ఆయన మృతి బీజేపీకి తీరని లోటని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక తెలిపారు. 
 
కాగా, మంత్రి ఉమేశ్ కత్తి మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నిర్ఘాంతపోయారు. అనుభవజ్ఞుడైన డైనమిక్ లీడర్‌ను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమేశ్ మృతి వార్త తెలిసిన వెంటనే ఆయన కేబినెట్ సహచరులు గోవింద్ కర్జోల్, కె.సుధాకర్ సహా పలువురు బీజేపీ నేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. 
 
ఉమేశ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
 
బెల్గావి జిల్లా హుక్కేరి తాలూకాలోని బెల్లాబ్‌బాగేవాడిలో జన్మించిన ఉమేశ్ కత్తి హుక్కేరి నుంచి 8 సార్లు శాసనభకు ఎన్నికయ్యారు. 1985లో ఆయన తండ్రి విశ్వనాథ్ కత్తి మరణం తర్వాత ఉమేశ్ రాజకీయాల్లోకి వచ్చారు. 
 
గతంలో జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప, డీవీ సదానంద గౌడ, జగదీశ్ షెట్టార్ నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రి పీఠంపై తనకున్న ఆకాంక్షను పలుమార్లు బహిరంగంగానే బయటపెట్టిన ఉమేశ్.. ఉత్తర కర్ణాటక ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసి వార్తల్లో నిలిచారు.