బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్‍‌పై దాడికి వచ్చిన పాక్ ఉగ్రవాది గుండెపోటుతో మృతి

pak terrorist
భారత్‌పై దాడి చేసేందుకు వచ్చన పాకిస్థాన్ ఉగ్రవాది గుండెపోటుతో చనిపోయాడు. పాక్ ఉగ్రవాద సంస్థలు ఇచ్చిన రూ.30 వేలు తీసుకుని భారత్‌పై దాడి చేసేందుకు వచ్చి, భారత రక్షణ దళాల చేతికి చిక్కాడు. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఈ ఉగ్రవాదికి భారత సైనికులు రక్తందానం చేసి ప్రాణాలు రక్షించారు. ఈ ఉగ్రవాది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. 
 
పాకిస్థాన్‌కు చెందిన తబ్రక్ హుస్సేన్ గత నెలలో జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద భారత్‌‍లోకి చొరబడేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. ముగ్గురు ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించగా, భారత సైన్యం జరిపిన కాల్పుల్లో తబ్రక్ తీవ్రంగా గాయపడి సైన్యానికి పట్టుబడాడు. మిగిలిన ఇద్దరూ పారిపోతూ ల్యాండ్‌మైన్ పేలి ప్రాణాలు కోల్పోయారు. 
 
అయితే, కాల్పుల్లో గాయపడిన తబ్రక్‌ను రాజౌరిలోని సైనిక ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత పోస్టులపై దాడి చేసేందుకు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కల్నల్ యూనుస్ చౌదరి తనకు రూ.30 వేల పాక్ కరెన్సీ ఇచ్చి పంపించారని వెల్లడించారు. 
 
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని సబ్జ్‌కోట్ గ్రామానికి చెందిన తబ్రక్ భారత్‌పై దాడి ప్రణాళికలను ఈ సందర్భంగా వెల్లడించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తబ్రక్ గుండెపోటుతో శనివారం తుదిశ్వాస విడిచారు.