శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 10 ఆగస్టు 2022 (13:54 IST)

క్రికెట్ ప్రపంచంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో రూడీ కోర్జెన్ మృతి

rudi - sehwag
క్రికెట్ ప్రపంచంలో తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో క్రికెట్ అంపైర్ రూడీ కోర్జెన్ దుర్మరణం పాలయ్యారు. గోల్ఫో టోర్నీ కోసం కేప్‌టౌన్ వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో 73 యేళ్ల రూడీ కోర్జెన్ చనిపోయారు. 
 
ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌గా సేవలు అందిస్తూ వచ్చిన ఆయన... వివాదరహితుడుగా గుర్తింపుపొందాడు. మైదానంలో ఆటగాళ్ళతో ఎంతో సౌమ్యంగా మెలిగేవారు. ముఖ్యంగా, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు రూడీ ఎంతో సన్నిహితుడు.
 
ఐసీసీ ఎలైట్ అంపైర్‌గా రూడీ కోర్జెన్ 1992 నుంచి 2010 వరకు అంపైర్ గా విధులు నిర్వర్తించాడు. 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20 అంతర్జాతీయ పోటీల్లో రూడీ అంపైరింగ్ చేశాడు. 
 
కాగా, రూడీ కోర్జెన్ మృతి పట్ల వీరేంద్ర సెహ్వాగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. అతడి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నానని సెహ్వాగ్ వెల్లడించాడు. రూడీతో తనకు ఎంతో గొప్ప అనుబంధం ఉందని తెలిపాడు. 
 
తాను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా అడ్డదిడ్డంగా ఆడితే, కాస్త బుర్రపెట్టి ఆడు అంటూ సూచన చేసేవాడని, నీ బ్యాటింగ్ చూడాలనుకుంటున్నాను అని చెప్పేవాడని సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. 
 
ఓసారి రూడీ తన కుమారుడికి ఓ కంపెనీ క్రికెట్ ప్యాడ్లు కొనాలని భావించి తనను సంప్రదించాడని, వెంటనే ఆ కంపెనీ ప్యాడ్లను బహూకరిస్తే ఎంతో సంబరపడిపోయాడని తెలిపాడు. చాలా మంచి వ్యక్తి అని, రూడీని మిస్సవుతున్నానని సెహ్వాగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు.