మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జల విద్యుత్ ప్రాజెక్టును డ్రాగన్ కంట్రీ చైనా ప్రారంభించింది. టిబెట్, భారత్ మీదుగా ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ఈ మెగా డ్యామ్ నిర్మాణం చేపట్టనుంది. ఈ నిర్మాణ పనులు శనివారం ప్రారంభించింది. ఈ ప్రారంభపనులకు చైనా ప్రధాని లి కియాంగ్ హాజరయ్యారని చైనా మీడియా వెల్లడించింది.
టిబెట్‌లోని యార్లుంగ్ త్సాంగ్సో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును బీజింగ్ డిసెంబరులో ఆమోదించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రధానంగా వినియోగం కోసం ఇతర ప్రాంతాలకు ప్రసారం చేయడం జరుగుతుంది. అదే సమయంలో టిబెట్‌లోని స్థానిక విద్యుత్ అవసరాలను కూడా తీరుస్తుందని అని ఆగ్నేయ టిబెట్‌లోని నైంగ్జిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమం తర్వాత వార్తా సంస్థ జిన్హుహా నివేదించింది.
ఇదిలావుంటే ఈ ప్రాజెక్టుపై భారత్, బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డ్రాగన్ కంట్రీ మాత్రం మొండిగా ముందకు వెళ్లడం గమనార్హం. ఎందుకంటే ఇది ఇరు దేశాల్లోని దిగువున ఉన్న లక్షలాది మంది ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది.
టిబెట్‌లోని ఈ ప్రాజెక్టు గురించి జనవరిలో చైనాతో ఆందోళన వ్యక్తం చేశామని భారత్ తెలిపింది. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. బ్రహ్మపుత్ర నది దిగువ ప్రాంతాలో జరిగే కార్యకలాపాల వల్ల దాని దిగువ ప్రాంతాల ప్రయోజనాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాను కోరడం జరిగింది అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.