సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (14:26 IST)

ప్రధాని మోడీ ప్రసంగం LIVE : సాయంత్రం 5 గంటలకు

దేశ ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులపై ఆయన మాట్లాడనున్నారు. మునుపటితో పోల్చితే కరోనా వ్యాప్తి నిదానిస్తుండడంతో అనేక రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియకు తెరదీశాయి.
 
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు. ప్రధానంగా వ్యాక్సినేషన్ అంశంపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తి నివారణలో వ్యాక్సిన్లు ఎంత కీలకపాత్ర పోషిస్తాయనే విషయంపై ఆయన సాయంత్రం తన ప్రసంగంలో వివరించే ప్రయత్నం చేయనున్నారు.
 
కాగా, దేశంలో గడచిన 24 గంటల్లో కేవలం లక్ష కేసులే నమోదు కావడం కొన్ని వారాల అనంతరం ఎంతో ఊరట కలిగించే విషయం. గత 61 రోజుల తర్వాత కరోనా రోజువారీ కేసుల్లో ఇదే కనిష్టం కావడంగ గమనార్హం. 
 
ఇంకోవైపు, పిల్లలపై కరోనా టీకా కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ స‌హా దేశంలోని నాలుగు ప్రాంతాల్లో ఈ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు. 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌పై ఈ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నామ‌ని, ఇందు కోసం తాము 18 మంది చిన్నారుల‌ను ఎంపిక చేశామ‌ని ఢిల్లీ ఎయిమ్స్ వ‌ర్గాలు తెలిపాయి.
 
కరోనా మూడో ద‌శ ప్ర‌భావం చిన్నారుల‌పై అధికంగా ఉంటుందన్న అంచనాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఈ ప‌రీక్ష‌ల‌కు డీజీసీఐ అనుమతులు ఇచ్చింది. 
 
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చిన‌ప్ప‌టి‌కీ వాటిని చిన్న పిల్లలకు వేసేందుకు ఇంకా ఎలాంటి అనుమతులు రాలేద‌న్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు అమెరికా, కెనడా, జపాన్‌, చైనా వంటి పలు దేశాలు త‌మ దేశాల్లో పిల్లలకు టీకాలు వేసేందుకు అనుమతులు ఇచ్చాయి.