శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 16 జనవరి 2017 (04:27 IST)

సైనికులను పెళ్లాడిన వారి కంట కన్నీరు ఎవరి పాపం?

నెలల తరబడి తమకు లీవులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆ అపరిచిత సైనికుడు పాటలో చెప్పడం విషాదకరం. పదినెలలవుతోంది. నాకు అధికారులు లీవ్ మంజూరీ చేయలేదు. మమ్మల్ని పెళ్లి చేసుకున్న వారి కళ్లనుంచి కన్నీరు కారుతోంది. నన్ను పెళ్లి చేసుకున్నామె తనకు పెళ

సమస్యల పరిష్కారం కోసం అంతర్గతంగా కాకుండా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే అది సైనికుల, సైన్యం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, ఇకపై తమ సమస్యలపై రోడ్డెక్కేవారిని కఠినంగా శిక్షిస్తామంటూ భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ తీవ్ర హెచ్చరిక చేసి ఒక రోజు పూర్తి కాలేదు. కానీ సైనిక బలగాలు సరిహద్దుల్లో పడుతున్న పాట్ల గురించి దయనీయంగా చెబుతూ గుర్తు తెలియని జవాన్ ఒకరు మరో వీడియో పెట్టడం సంచలనానికి దారి తీసింది. ఇది సైన్యంలో లుకలుకల గురించి చెప్పిన మూడో వీడియో కావడం విశేషం. 
 
ఆదివారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర వీరులకు నివాళి పలికిన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సోషల్ మీడియాకు సమస్యలు చెప్పుకుంటున్న సైనికులను హెచ్చరించారు. సైన్యం నైతిక ధృతిని దెబ్బతీసేవారిని శిక్షిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. కానీ ఆదివారం సాయంత్రానికి అపరిచిత సైనికుడొకరు సరిహద్దుల్లో ఉన్న సైనికుల పాట్ల  గురించి పాటరూపంలో వీడియో పంపడం విశేషం.  
 
తాజా వీడియోను సైనికుడు స్వీయ బాధలను చెప్పుకుంటున్నట్లుగా కాకుండా, ఒక సిక్కు సైనికుడు తన తోటి సైనికులముందు పాడుతున్నట్లుగా రూపొందించారు. ఒక సరిహద్దు గస్తీ కేంద్రం నుంచి తీసి పంపినట్లుగా కనిపిస్తున్న ఈ వీడియోలో ప్రజలు నగరాల్లో తాజ్ హోటల్‌కి వెళ్లి పంచభక్ష్య పరమాన్నాలూ ఆరగిస్తుండగా సరిహద్దుల్లో కాపలాకాస్తున్న తమకు  తినడానికి రొట్టె, ఊరగాయ మాత్రమే ఇస్తున్నారని ఆ పాట చెబుతోంది. 
 
పైగా నెలల తరబడి తమకు లీవులు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆ అపరిచిత సైనికుడు పాటలో చెప్పడం విషాదకరం. పదినెలలవుతోంది. నాకు అధికారులు లీవ్ మంజూరీ చేయలేదు. మమ్మల్ని పెళ్లి చేసుకున్న వారి కళ్లనుంచి కన్నీరు కారుతోంది. నన్ను పెళ్లి చేసుకున్నామె తనకు పెళ్లయిందా కాలేదా అనే సందిగ్ధావస్థలో పడుతోందని చెబుతున్న ఆ పాటను ఆదివారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 
 
సైన్యంలో పనిచేస్తున్న యువత గురించి రాజకీయనేతలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని గుర్తు తెలియని జవాను ఆ పాటలో చెప్పాడు. శుభరాత్రి అని చెప్పి వారు నిద్రపోతారు. మేం దీపావళి సరిహద్దుల్లో సెలబ్రేట్ చేసుకుంటామని ఆ పాట చెబుతోంది. 
 
గత వారం 42వ ఇన్‌ఫాంట్రీ బ్రిగేడ్‌కి చెందిన లాన్స్ నాయక్ యాగ్య ప్రతాప్ సింగ్ సైన్యంలో ఆర్డర్లీ (సహాయక్) వ్యవస్థకు వ్యతిరేకంగా వీడియో పోస్ట్ చేశారు. సైనికులను సీనియర్ల బట్టలు ఉతకడానికి, బూట్లు పాలిష్ చేయడానికి, తమ ఇంటి కుక్కలను నడిపించడానికి ఉపయోగించుకుంటున్నారని ప్రతాప్ సింగ్ ఆరోపించారు. ఇలాంటి పనులను వ్యతిరేకిస్తూ ఫిర్యాదు చేసినందుకు పై అధికారులు తనను బలిచేశారని వాపోయారు. 
 
ఇదిలా ఉండగా నాసిరకం ఆహారం అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్‌కి మద్దతుగా నర్సింగ్ అసిస్టెంట్ నాయక్ రామ్ భగత్ మాట్లాడారు. యాదవ్ చెప్పింది నిజమేనని, సైనికులకు కేటాయిస్తున్న రేషన్‌లో కేవలం 40 శాతం మెనూ మాత్రమే వారికి అందుతోందని, మిగతా రేషన్ సరకులు ఎక్కడికి పోతున్నాయో ఎవరికీ తెలియదని నాయక్ ఆరోపించారు. తానే కాదు సైన్యం లోని ప్రతి జవానూ వీటి గురించి చెప్పాలనుకుంటున్నారు కానీ ఎక్కడ ఎవరితో మాట్లాడాలన్నది ఎవరికీ తెలియడం లేదని నాయక్ వాపోయారు.