గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (19:11 IST)

హస్తినలో 144 సెక్షన్ ... 31వ తేది అర్థరాత్రి 12 గంటల వరకు..

దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 31వ తేదీ వరకు  144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఆదివారం రాత్రి 9 గంటల నుంచి మార్చి 31వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. 144 సెక్షన్‌ విధించడంపై ఢిల్లీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే 144 సెక్షన్‌ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని, తద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.
 
అలాగే, 13వ తేదీ వరకు మెట్రో రైళ్ళ సర్వీలను కేంద్రం నిలిపివేసింది. అదేవిధంగా అన్ని రకాల ప్రజా రవాణా కూడా ఢిల్లీ ప్రభుత్వం నిలిపివేసే అవకాశం ఉంది. పైగా, ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.
 
దేశంలో కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తుండడంతో ప్రజలు బయటకు రాకూడదనీ, సమూహాలుగా ఏర్పడకూదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమకు తాము స్వీయ నిర్బంధం పాటిస్తే.. కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, ఆదివారం దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను విజయవంతంగా పూర్తిచేశారు. 
 
యూపీలో 15 జిల్లాలు లాక్‌డౌన్ 
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌(కోవిద్‌-19)ను అరికట్టేందుకు కేంద్రంతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 జిల్లాలు లాక్‌డౌన్‌ చేస్తున్నట్లు వివరించారు. కరోనా మహమ్మారి నివారించాలంటే, ఈ నిర్ణయం తప్పదని యూపీ సీఎం వెల్లడించారు. 
 
ప్రజలు తప్పకుండా ప్రభుత్వ నిర్ణయాలను, సూచనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలనీ, ఎవరు కూడా బయటకు రాకూడదని సీఎం తెలిపారు. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే.. కరోనా వైరస్‌ను నివారించవచ్చని ఆయన అన్నారు. 
 
లాక్‌ డౌన్‌ అయిన జిల్లాలు: ఆగ్రా, లక్నో, గౌతమ్‌ బుద్ధ్‌ నగర్‌, ఘజియాబాద్‌, మొరదాబాద్‌, వారణాసి, లఖీంపూర్‌ ఖిరి, బరేలీ, ఆజమ్‌గఢ్‌, కాన్పూర్‌, మీరట్‌, ప్రయాగ్‌రాజ్‌, అలీఘర్‌, గోరఖ్‌పూర్‌, సహరాన్‌పూర్‌ ఉన్నాయి. లాక్‌డౌన్‌ ప్రభావం ఆయా జిల్లాల్లో మార్చి 23 నుంచి 25 వరకు రెండు రోజులపాటు ఉంటుందని యూపీ సీఎం తెలిపారు.