సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : తెలంగాణాలో 31 వరకు లాక్‌డౌన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టే చర్యల్లో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు.
కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమనంతరం ప్రగతిభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారు. దేన్నయిన ఎదుర్కోగలం అనే సంఘీభావం ప్రకటించారన్నారు. ప్రజలంతా ఇప్పటివరకు ఎలా క్రమశిక్షణతో ఉన్నారో.. మార్చి 31వరకు ఇంటి దగ్గరే ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ ప్రదేశంలో కూడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు.
ఎవరి ఇళ్ళకు వారు పరిమితం కావాలని సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ బంద్ ఉంటుందని సీఎం వెల్లడించారు. ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు.. ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందన్నారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా, రూ.1500 నగదును ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. మార్చి 31వరకు ప్రజా రవాణా బంద్ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు బంద్ ఉంటయన్నారు.