12 హైకోర్టులకు 68 మంది పేర్లను సిఫార్సు చేసిన కొలీజియం
దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగావున్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, దేశంలోని 12 హైకోర్టులకు ఒకేసారి 68 మంది పేర్లను సిఫార్సు చేసి చరిత్ర సృష్టించింది.
సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 12 హైకోర్టులకు 68 మంది పేర్లను జడ్జిలుగా సిఫారసు చేసింది. వీరిలో పది మంది మహిళలు ఉండటం గమనార్హం. జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ల నేతృత్వంలోని కొలీజియం మొత్తం 113 మంది పేర్లను పరిశీలించింది. వీరిలో 82 మంది న్యాయవాదులు కాగా 31 మంది జ్యుడీషియల్ సర్వీస్ అధికారులు ఉన్నారు.
చివరికి 44 మంది న్యాయవాదులు, 24 మంది జ్యుడీషియల్ సర్వీసెస్ అధికారులను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు సిఫార్సు చేయాలని కొలీజియం నిర్ణయించింది. షెడ్యూల్డ్ తెగలకు చెందిన మహిళా జ్యుడీషియల్ అధికారి మరాలి వంకుంగ్ పేరును గౌహతి హైకోర్టుకు సిఫార్సు చేసింది. రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిజోరం నుంచి వచ్చిన తొలి హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కుతారు.