దారుణం: శవాల మీద దుస్తులూ వదలట్లేదు
బాగ్‌పట్ (యూపీ): కరోనా రోగుల నుంచి వైద్యం పేరిట ఆసుపత్రులు దోచుకోవడం చూశాం. కొన్నిచోట్ల బాధితుల ఆభరణాలు మాయమైన ఘటనల గురించి విన్నాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాది కొత్త దందా! కరోనాతో మరణించిన వారి దుస్తులు దొంగిలించడం, వాటిని ఉతికి మళ్లీ విక్రయించడం వీరి పని! ఈ విధంగా శ్మశానవాటికల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను యూపీలోని బాగ్‌పట్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
కొవిడ్ మృతదేహాలపై కప్పిన ముసుగులు సహా, చీరలు, కుర్తాలు, బెడ్‌షీట్లు, ఇతర వస్తువులను ఈ ముఠా చోరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి మొత్తం 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 చీరలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇలా చోరీ దుస్తులను బాగా ఉతికి, ఇస్త్రీ చేసి కొత్త లేబుళ్లు వేసి విక్రయిస్తున్నారని చెప్పారు.
స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్ కుదుర్చుకుని, వారికి రోజుకు రూ.300 చొప్పున చెల్లించి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు కూడా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అరెస్టయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కరోనా కాలంలో ఇంకెన్ని దారుణాలు చూడాలో!!