శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 మే 2021 (14:37 IST)

కరోనాతో మావోయిస్టులు బలి.. మన్యంలోకి ప్రవేశించిన కోవిడ్ కర్కసి

కరోనా మహమ్మారి మావోయిస్టులను కూడా వదిలిపెట్టలేదు. నగరాల్లోనే కాదు.. మన్యంలోకి కూడా చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. మావోయిస్టులు కరోనా కాటుకు బలవుతున్నట్లుగా తెలుస్తుంది.
 
గిరిజనులు కూడా కరోనా బారిన పడినట్లు దంతెవాడ ఎస్పీ పల్లవ వెల్లడించారు. 10 మంది మావోయిస్టులు కరోనాతో మృతి చెందినట్లు, మరో వందమంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం అందిందని ఎస్పీ వివరించారు. కరోనా సోకడంతోపాటు, కలుషిత ఆహారం తినడం వలన మావోలు మృతి చెందినట్లు పేర్కొన్నారు.
 
కరోనాతో చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దళ కమాండర్లు కూడా ఉన్నారని ఎస్పీ తెలిపారు. అయితే మృతి చెందిన మావోయిస్టుల పేర్లు వెల్లడి కాలేదు. ఇక కుంట, డోర్నపాల్ ఏరియాల్లో మావోయిస్టులు కరోనా వ్యాక్సిన్‌తో పాటు దానికి సంబంధించిన ఔషదాలను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు.
 
గిరిజనులకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు అధికారులు వ్యాక్సిన్ డోసులను తరలిస్తుండగా మావోలు అడ్డగించి వాటిని దారిదోపిడి చేసినట్లు సమాచారం. ఇక కరోనా సోకిన వారిలో మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్టు సమాచారం.