అన్నాడీఎంకే పగ్గాలకు దూరంగా శశికళ.. 2019 ఎన్నికల వరకు మౌనం.. ప్రజామోదం కోసమే?
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపడతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పట్లో ఆ పని జరిగేలా లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె స్థానంలో అన
తమిళనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అన్నాడీఎంకే పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపడతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పట్లో ఆ పని జరిగేలా లేదు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె స్థానంలో అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు చేపట్టేది ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. శశికళ ప్రజల ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని... అందుకోసం 2019 లోక్‌సభ ఎన్నికల వరకు ఎదురుచూడనున్నారని సమాచారం. ఎన్నికల తర్వాతే పార్టీ పగ్గాలు ఆమె చేపట్టే అవకాశముందని అన్నాడీఎంకే వర్గాల సమాచారం.
జయలలిత మరణం తర్వాత శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని పార్టీలోని ఓ వర్గం నుంచి పెద్దఎత్తున ఒత్తిడి వస్తున్న సంగతి తెలిసిందే. అయినా శశికళ ఆ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంకా అన్నాడీఎంకే అధినేత్రి పగ్గాలను చేపట్టే అంశంపై శశికళ నోరు విప్పలేదు. మౌనంగా ఉన్నారు. ఇందుకు కారణం ఉందని తెలుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాల్సిందిగా పార్టీ వర్గాలు మాత్రమే కోరుతున్నాయి.
ప్రజామోదం కూడా పొందాలంటే 2019 లోక్‌సభ ఎన్నికల వరకు వేచి చూడాలని శశికళ భావిస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకు ఆ పదవి ఖాళీగా ఉంటుందని కొందరు పార్టీ నేతలు తెలిపారు. మరోవైపు మరికొందరు సీనియర్ నేతలు దీన్ని ఖండిస్తున్నారు. పార్టీ అధినేత లేకుండా అన్నిరోజుల పాటు పార్టీ నడపడం కష్టమని, జయలలిత మృతి కారణంగా ఖాళీ ఏర్పడిన ఆర్కేనగర్‌కు ఆరునెలల్లో ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ అధినేత తప్పనిసరని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ధీరన్ అన్నారు.
ఇక పార్టీ సర్వసభ్య సమావేశం ఈ నెల 29న జరగనుంది. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉండడం, ఇప్పటివరకు పార్టీ పగ్గాల గురించి శశికళ నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడం ఈ వూహాగానాలకు బలం చేకూరుతోంది. మరోవైపు పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆమెను పార్టీ కార్యదర్శిగా ప్రకటిస్తారని విస్తృత ప్రచారం జరుగుతుండగా.. కిందిస్థాయి నేతల్లో మాత్రం శశికళకు వ్యతిరేకత అధికమవుతోంది.