నీట్ పరీక్ష భయంతో విద్యార్థి ఆత్మహత్య
ఆ విద్యార్థి ఇప్పటికే రెండు సార్లు నీట్ పరీక్ష రాశారు. రెండుసార్లూ ఫెయిల్ అయ్యారు. ఆదివారం జరిగిన నీట్ పరీక్షను రాసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఈ పరీక్షలో కూడా ఓడిపోతానన్న భయంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆదివారం వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)ను దేశ వ్యాప్తంగా నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నాడు.
చనిపోయిన వ్యక్తిని సేలంలోని మెట్టూరు సమీపంలోని కూజయ్యూర్‌కు చెందిన 19 ఏండ్ల ధనుష్‌గా గుర్తించారు. అతడు గతంలో రెండు సార్లు నీట్‌కు హాజరయ్యాడు. అయితే పాస్ కాకపోవడంతో మరోసారి నీట్‌కు ప్రిపేర్ అయ్యాడు.
అయితే ఈసారి కూడా అందులో అర్హత సాధించలేనన్న భయంతో ఆదివారం తెల్లవారుజామున తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడు నీట్‌పై ఒత్తిడిలో ఉన్నట్లు ధనుష్ తల్లిదండ్రులు, సోదరుడు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజాగా తన ప్రాంతానికి చెందిన విద్యార్థి ధనుష్ ఆత్మహత్యపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి డీఎంకే ప్రభుత్వాన్ని విమర్శించారు. నీట్‌ను రద్దు చేస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై ట్విట్టర్‌లో ప్రశ్నించారు.
మరోవైపు నీట్ విద్యార్థి ఆత్మహత్యపై సీఎం స్టాలిన్ స్పందించారు. నీట్ నుంచి శాశ్వత మినహాయింపును కోరే బిల్లును అసెంబ్లీలో సోమవారం పాస్ చేస్తామని తెలిపారు. అన్యాయానికి ముగింపు పలుకుదాం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.