నీట్ పరీక్షలు ఆదివారం (సెప్టెంబర్ 12) జరగనుంది. పెన్నూ పేపరు విధానంలో నిర్వహించే ఈ పరీక్ష రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని తొమ్మిది పట్టణాల్లో 151 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తెలంగాణలో 7 పట్టణాల్లో 112 కేంద్రాల్లో పరక్షకు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) స్పష్టంచేసింది.
మాస్కు తప్పనిసరని, చిన్న శానిటైజర్ బాటిల్‌ను కూడా అనుమతిస్తామని తెలిపింది. హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు.
పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఎన్టీయే ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, షూ ధరించరాదని షరతు విధించింది. ఇక అమ్మాయిలైతే చెవిపోగులు, గొలుసులు వంటి ఆభరణాలు పెట్టుకోరాదని ఆదేశించింది.
ఈ నిబంధనలు మరచిపోవద్దు..
* నీట్ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించాలి. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి వారు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి.
* అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్ ఉండే సాండిల్స్ మాత్రమే వేసుకుని రావాలి.
* వ్యాలెట్, పౌచ్, గాగుల్స్, టోపీలు, హ్యాండ్ బ్యాగులు వంటివి తీసుకురావొద్దు.
* పెన్సిల్‌బాక్సు, కాలిక్యులేటర్, పెన్ను, స్కేల్, రైటింగ్ ప్యాడ్ వంటివి కూడా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* మొబైల్ ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, హెల్త్ బ్యాండ్, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా తమ వెంట తీసుకురావొద్దు.
* అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్, బ్రాస్‌లెట్ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దు.
* అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు.