ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 జనవరి 2024 (10:03 IST)

సమ్మె విరమించిన ట్యాంక్ - ట్రక్కుల డ్రైవర్లు.. తీరిన పెట్రోల్ సమస్య

petrol bunk - riders
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) చట్టంలో హిట్ అండ్ రన్ శిక్షలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ట్యాంకర్‌, ట్రక్కు డ్రైవర్లు తమ సమ్మెను విరమించారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సోమవారం ప్రారంభమైన డ్రైవర్ల సమ్మె.. మంగళవారం పలు ప్రాంతాల్లో ఉధృతంగా సాగింది. ట్యాంకర్‌, ట్రక్కు డ్రైవర్లకు ప్రైవేట్‌ బస్సులు, క్యాబ్‌ డ్రైవర్లు కూడా సంఘీభావంగా నిలవడంతో.. మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హైవేలపై రాకపోకలు స్తంభించిపోయాయి. 
 
మూడుప రోజుల సమ్మె అంటూ తొలుత ప్రకటన వెలువడడంతో ఆందోళన చెందిన వాహనదారులు పెట్రోల్‌ బంకులకు పోటెత్తారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఈ పరిస్థితి కనిపించింది. జమ్మూకాశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో 90 శాతం పెట్రోల్‌ బంకుల్లో నిల్వలు నిండుకున్నాయని పెట్రో డీలర్ల సంఘాలు ప్రకటించాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌(ఏఐఎంటీసీ) ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐఎంటీసీ ప్రతినిధులు తమ సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టారు.
 
హిట్ అండ్ రన్ కేసుల్లో భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లో శిక్షలు తక్కువగా ఉండగా.. బీఎన్‌ఎస్‌లో పదేళ్ల వరకు జైలు శిక్షలున్నాయని, పేద ట్రక్కు డ్రైవర్లకు ఇవి తీవ్ర శిక్షలని పేర్కొన్నారు. దీనికి స్పందించిన అజయ్‌ భల్లా.. 'కొత్త చట్టాన్ని అమలు చేయడానికి ముందు మీ ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటాం. అప్పుడు మరోసారి సమీక్షిద్దాం. ఆందోళనలను విరమించండి' అని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఏఐఎంటీసీ ప్రతినిధులు.. సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. 
 
ట్యాంకర్‌/ట్రక్కు డ్రైవర్లు హైవేలను దిగ్బంధించడం, ప్రైవేటు బస్సు, క్యాబ్‌ డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పలు రాష్ట్రాల్లో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు. మహారాష్ట్రలోని ముంబై, నవీముంబై, నాగ్‌పూర్‌, షోలాపూర్‌, ధారాశివ్‌, పాల్గఢ్‌, బీడ్‌, హింగోలీ, ఛత్రపతి సంభాజీనగర్‌, నాసిక్‌, గడ్చిరోలి, వార్ధాల్లో జాతీయ రహదారులను దిగ్బంధం చేయడంతో.. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ కనిపించింది. అయితే, ఒక్క హైదరాబాద్ నగరంలో మినహా, ఇతర దక్షిణాది మెట్రో నగరాల్లో ఈ సమ్మె పెద్దగా కనిపించలేదు.