బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (08:04 IST)

రసకంధాయంలో మధ్యప్రదేశ్ రాజకీయం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ ‘ఎర’: దిగ్విజయ్ సింగ్

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు బీజేపీ కోట్లాది రూపాయలు ‘ఎర’గా చూపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తన వాదనకు మరింత పదునుపెట్టారు.

బహుజన్ సమాజ్‌ పార్టీ (ఎమ్మెల్యే) రామ్‌భాయ్‌ని బీజేపీ నేత ఒకరు ‘చార్టెట్ ఫ్లయిట్’లో సోమవారంనాడు ఢిల్లీకి తీసుకెళ్లారని ఓ ట్వీట్‌లో ఆయన తాజాగా ఆరోపించారు. 'బీఎస్‌పీ, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ శాసనసభ్యులను ఢిల్లీకి తరలించే ప్రక్రియను బీజేపీ మొదలుపెట్టేసింది.

బీఎస్‌పీ ఎమ్మెల్యే రామ్‌భాయ్‌ని నిన్న చార్టెట్ విమానంలో భూపిందర్ సింగ్ ఢిల్లీకి తీసుకురాలేదా? శివరాజ్ సింగ్ చౌహాన్ జీ….దీనిపై మీరేమైనా చెబుతారా?’ అని దిగ్విజయ్ ప్రశ్నించారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు శివరాజ్ సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా 25 నుంచి 35 కోట్ల రూపాయలు ఎర చూపిస్తున్నారంటూ దిగ్విజయ్ సోమవారం సంచలన ఆరోపణలు చేశారు.

15 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న శివరాజ్, మిశ్రాలు ఎంతమాత్రం విపక్షంలో కూర్చుకునేందుకు సిద్ధంగా లేరని, దీంతో బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూ.35 కోట్లు ఆశ చూపిస్తున్నారని ఆరోపించారు.

తొలి విడతగా రూ.5 కోట్లు, రాజ్యసభ నామినేషన్ల తర్వాత రెండో ఇన్‌స్టాల్‌మెంట్, ప్రభుత్వం కూలిపోయిన తర్వాత తక్కిన మొత్తం ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తున్నారని అన్నారు.

ఆధారాలు లేకుండా తానెప్పుడూ ఎవరిపైనా ఆరోపణలు చేసింది లేదని కూడా ఆయన తన వాదనను సమర్ధించుకున్నారు. కాగా, దిగ్విజయ్ ఆరోపణలను శివరాజ్ సింగ్ కొట్టిపారేశారు. ‘అబద్ధాలు చెప్పి సంచలనం సృష్టించడం ఆయనకున్న పాత అలవాటే’ అని వ్యాఖ్యానించారు.
 
బీజేపీ ప్రలోభ పెట్టడం వాస్తవమే : కమల్ నాథ్
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందన్న వదంతులను ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ధ్రువీకరించారు. ఫ్రీగా బిజెపి పంచిపెడుతున్న డబ్బును తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తాను సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన బిజెపి మళ్లీ అధికారాన్ని దొడ్డిదారిన చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి కమల్ నాథ్, తమకు డబ్బు ముట్టచెబుతామంటూ బిజెపి ప్రలోభపెడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తన దృష్టికి తీసుకువచ్చారని కమల్‌నాథ్ చెప్పారు.

ఊరికే డబ్బు వస్తుంటే ఎందుకు వద్దంటారని, తీసుకోవాలని తానే వారికి చెప్పానని ఆయన అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 107 లభించగా కాంగ్రెస్ పార్టీ 114 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యేలు, బిఎస్‌పి, ఎస్‌పి ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది.

ఇప్పుడు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. 5-7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిజెపి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, మొదటి వాయిదాగా తలా రూ. 50 కోట్లు, రాజ్యసభ ఎన్నికల తర్వాత మరి కొంత ముట్టచెబుతామని వారికి బిజెపి నేతలు ఆశచుపుతున్నారని దిగ్విజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.