1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 మే 2025 (16:23 IST)

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

delhi rain
ఢిల్లీని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశాయి. ఈ భారీ వర్షాలతో ఢిల్లీ నగరం అతలాకుతలమైంది. ఈ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఘజియాబాద్‌లోని పోలీస్ స్టేషన్‌ కూలిపోయింది. ఠాణా పైకప్పు కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ఆ స్టేషన్ ఎస్ఐ దుర్మరణం పాలయ్యాడు. ఏసీపీ అంకుర్ విహార్ ఆఫీస్‌లో వీరేంద్ర మిశ్రా (58) ఎస్ఐ విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి వర్షం, పెనుగాలులకు స్టేషన్ పైకప్పు కూలిపోయింది. 
 
వర్షం కారణంగా స్టేషన్‌లోనే ఉండిపోయిన మిశ్రా.. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు మీదపడటంతో తీవ్ర గాయాలపాలై మిశ్రా మరణించారని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల మేరకు.. ఢిల్లీలో శనివారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5.30 గంటల వరకు 81.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మోతీబాగా, మింట్ రోడ్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్, ఢిల్లీ కంటోన్మెంట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.