ఉత్తరాఖండ్‌లో వరదల్లో కొట్టుకునిపోయిన కారు - 9 మంది జలసమాధి
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా, ఉత్తరభారతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లో వర్షాల కారణంగా రామ్‌నగర్‌లో దెల్హా నది పొంగిపొర్లడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది జలసమాధి అయ్యారు. మరో ఐదుగురు వరదలో చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఒక బాలికను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే మహారాష్ట్ర, గోవా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంది. దీంతో గోవా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరు బయటకు రావొవద్దని హెచ్చరించింది.
అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడొచ్చనే సూచనలతో హిమాచల్ ప్రదేశ్‌లోని మశోబరా ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో మొత్తం బురదమయంగా మారిపోయింది. అస్సాంలో వరదలు కొంతమేరకు శాంతించాయి.