మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జనవరి 2021 (14:03 IST)

కరోనా వ్యాక్సిన్‌లో విషాదం.. టీకా వేయించుకున్న వార్డు బాయ్ మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. కరోనా టీకా వేయించుకున్న వార్డు బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. 
 
మహిపాల్ సింగ్ అనే వార్డు బోయ్ సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఛాతీనొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. 
 
దీనిపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి మాట్లాడుతూ, శనివారం మధ్యాహ్నం కోవిషీల్డ్ తొలి డోసు తీసుకున్నాడని... నిన్న అతనికి శ్వాస ఆడక, ఛాతినొప్పితో బాధ పడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని చెప్పారు. 
 
అయితే, వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్టుతో అతను చనిపోయాడని తాను భావించడం లేదని చెప్పారు. మహిపాల్ మరణానికి గల కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా టీకా వేయించుకున్న తర్వాత అన్‌ఈజీగా అనిపిస్తే మాత్రం.. వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
 
మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న ఓ వ్యక్తికి కూడా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తాయి. దీంతో, అతడిని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అతనికి రియాక్షన్ తలెత్తింది. తలపోటు, దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలతో అతను బాధపడ్డాడు.