శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 జులై 2022 (19:57 IST)

అర్పిత ఇంట్లో చిక్కి నగదు లెక్కించేందుకు ఎన్ని గంటలు పట్టిందో తెలుసా?

currencynotes - ed
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్‌ను తవ్వేకొద్దీ నోట్ల కట్టలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన బెంగాల్ మంత్రి పార్థ చటర్జీకి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీకి చెందిన రెండు ఫ్లాట్లలో దాదాపు 50 కోట్ల రూపాయల నగదును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
రెండో పర్యాయంలో జరిగిన సోదాల్లో రూ.27.9 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును లెక్కించేందుకు ఈడీ అధికారులు ఎనిమిది మంది బ్యాంకు అధికారులను పిలిపించి లెక్కించారు. అంతేకాకుండా, ఐదు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం జరిపిన సోదాల్లో రూ.21.9 లక్షల కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
తాజాగా గుర్తించిన డబ్బులు లెక్కించేందుకు అధికారులకు భారీ సమయం పట్టింది. మొత్తం 13 గంటల పాటు శ్రమించి పెద్ద గుట్టగా పడివున్న కరెన్సీ నోట్ల కట్టలను ఓ క్రమ పద్దతిలో లెక్కించారు. ఆ డబ్బును లెక్కించేందుకు 4 క్యాష్ కౌంటింగ్ యంత్రాలను, 8 మంది బ్యాంకు సిబ్బందిని ఉపయోగించారు.
currencynotes - ed
 
రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా పార్థ చటర్జీ ఉన్న సమయంలో ఈ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ జరిగింది. ఈ స్కామ్‌లో భారీగా ముడుపులు మారినట్టు పక్కా ఆధారాలను సేకరించిన ఈడీ అధికారులు  మంత్రి పార్థ ఛటర్జీ నివాసంతో పాటు ఆయనకు సన్నిహితులైన అర్పిత ముఖర్జీ నివాసంలో సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు.