శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:52 IST)

స్మృతి ఇరానీని అసభ్య పదజాలంతో దూషించవద్దు : రాహుల్ గాంధీ

rahul gandhi
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత స్మృతి ఇరానీని ఓ ఒక్క కాంగ్రెస్ నేత లేదా కార్యకర్త అవమానకరమైన అసభ్య పదజాలంతో విమర్శలు చేయవద్దని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన స్మృతి ఇరానీ... కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ లాల్ శర్మ చేతిలో ఓపోయారు. గత ఎన్నికల్లో మాత్రం రాహుల్ గాంధీని ఓడించారు. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని లక్ష్యంగా చేసుకుని పలువురు కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. 
 
గెలుపోటములు జీవితంలో భాగమన్నారు. స్మృతి ఇరానీ పట్ల అసహ్యకరమైన భాష ఉపయోగించడం మానుకోవాలని హితవు పలికారు. 'స్మృతి ఇరానీ కానీ, మరే నేతపై అయినా సరే, అవమానకరమైన పదజాలంతో విమర్శలు చేయవద్దని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నా' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. 
 
ఇతరులను అవమానించడం, బాధపెట్టడం అనేది బలం కాదు... బలహీనతకు సంకేతం అని పేర్కొన్నారు. స్మృతి ఇరానీ ఎట్టకేలకు ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. దీనిపై కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.