శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (11:11 IST)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

indian army
అగ్ని వీరుడు విజయ్ కుమార్ కుటుంబానికి పరిహారం చెల్లించలేదంటూ ఇటీవల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. విధి నిర్వహణలో అమరుడైన 'అగ్ని వీరుడు' అజయ్ కుమార్ కుటుంబానికి పరిహారం కింద రూ.98 లక్షలు ఇచ్చామని భారత ఆర్మీ బుధవారం పేర్కొంది. అమర జవాన్ కుటుంబానికి కేంద్రం ఇంతవరకూ పరిహారం చెల్లించలేదంటూ కాంగ్రెస్ నేత ఆరోపణలను ఆర్మీ తోసిపుచ్చింది.
 
అగ్నివీరుడి కుటుంబానికి చెల్లించాల్సిన మొత్తంలో రూ.98 లక్షలను ఇప్పటికే అందజేశాం. అగ్నివీర్ పథకం నిబంధనల ప్రకారం, ఎక్స్ గ్రేషియాతో పాటు ఇతర బెనిఫిట్స్ కలిపి రూ.67 లక్షలను పూర్తి సెటిల్మెంట్, పోలీస్ వెరిఫికేషన్ తరువాత చెల్లిస్తాం. మొత్తం పరిహారం రూ.1.65 కోట్లు.. ఆర్మీ వెల్లడించింది. 
 
పరిహారాన్ని అమరుడైన అగ్ని వీరుడి కుటుంబానికి తక్షణం చెల్లించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.
 విధి నిర్వహణలో అమరుడైన అగ్నివీరుడు అజయ్ కుమార్ కుటుంబానికి చెల్లించాల్సిన పరిహారం విషయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసత్యమాడారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డ విషయం తెలిసిందే. 
 
అగ్నివీరులను ప్రభుత్వం వాడుకుని పారేసే కార్మికులుగా చూస్తోందని లోక్ సభలో రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు బదులిచ్చిన రాజ్ నాథ్ సింగ్.. సభను తప్పుదోవ పట్టించొద్దని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన అగ్నివీరుల కుటుంబాలకు పరిహారం కింద రూ.కోటి లభిస్తుందని తెలిపారు. 
 
నాలుగేళ్ల పాటు ఆర్మీలో పనిచేసేందుకు కేంద్రం 2022 జూన్ 14న అగ్నివీర్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల నుంచి 21 మధ్య ఉన్న వారిని నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసేందుకు ఈ పథకం ద్వారా ఎంపిక చేస్తారు. 
 
అగ్నివీరుల్లో తగిన అర్హత గల వారిని మరో 15 ఏళ్ల పాటు ఆర్మీలో కొనసాగిస్తారు. అయితే, ప్రభుత్వం గతేడాది ఈ పథకానికి సంబంధించిన గరిష్ట వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచింది.