శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (15:57 IST)

మార్చి నెలలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్.. దేశాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం : ప్రధాని మోడీ

దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలతో పాటు వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల శాసనసభలకు త్వరలో ఎన్నికలు జరగాల్సివుంది. ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ప్రధాని సూచన ప్రాయంగా వెల్లడించారు. 
 
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల కమిషన్ మార్చి 7వ తేదీ నాటికి మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి కూడా తేదీని ఈసీ ప్రకటించవచ్చునన్నారు. 
 
ఇదిలావుంటే, కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యరంగంపై మాట్లాడుతూ, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తమ ప్రభుత్వం ప్రధానంగా 4 అంశాలపై దృష్టి సారించిందన్నారు. 
 
రోగాలను నియంత్రించడం, ఆరోగ్య సంక్షేమాన్ని ప్రోత్సహించడం, ఆరోగ్య వసతులు మెరుగుపరిచి అందరికీ అందుబాటులో ఉంచడం, ఆరోగ్య నిపుణుల సంఖ్యను పెంచడమేకాకుండా నాణ్యతను పెంపొందించే చర్యలపై కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.  
 
ఆరోగ్య రంగంలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులకే పరిమితం కాకుండా, మారుమూల గ్రామాల్లోనూ ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తోందని వివరించారు. ఆరోగ్య రంగంలో పెట్టుబడుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. 
 
కరోనా గురించి చెబుతూ, భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని కరోనా సంక్షోభం గుణపాఠం నేర్పిందని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 137 శాతం మేర కేటాయింపులు పెంచడం తెలిసిందే.