సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

మోడీ ఓ పాము.. కేసీఆర్ ఓ తేలు : భట్టి విక్రమార్క ధ్వజం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లను తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క్.. పాము, తేలుతో పోల్చారు. ప్రధాని మోడీ నల్ల చట్టాలతో రైతులను పాములా కాటేసేందుకు యత్నిస్తున్నారు. ప్రతీ రైతు ముల్లుగర్రను తిప్పి పామును కొట్టినట్టు కర్రలతో మోడీ ప్రభుత్వాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
 
అలాగే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ తేలులా ప్రవర్తిస్తున్నారు. రైతులంతా ఏకమై ఆయనను చెప్పుతో తొక్కి పడేయాలి అని సీఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్కం రైతులకు పిలుపునిచ్చారు. 
 
ఈ నెల 9న ఆదిలాబాద్‌ నుంచి ప్రారంభమైన రైతు ముఖా ముఖీయాత్ర 14 రోజులపాటు 2వేల కిలోమీటర్లు 33 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగి ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దగోపతిలో సోమవారం ముగిసింది. 
 
ఈ సందర్భంగా పెద్దగోపతిలో జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ ఆదిలాబాద్‌ నుంచి ఖమ్మం వరకు రైతుల సమస్యలను తెలుసుకుని.. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ సమావేశాల్లో వారి గొంతుకలను వినిపించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామన్నారు.
 
వరి, పసుపు, పత్తి, మిర్చి, చెరుకు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని, కనీస మద్దతు ధరకు తాము నోచుకోవడం లేదంటూ రైతు ముఖాముఖీ యాత్ర సందర్భంగా రైతులు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. రైతులు, రైతు కూలీలు ఐక్య పోరాటాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపాలన్నారు.