కేరళలో మరో రవళి.. ప్రేమించలేదని పెట్రోల్ పోసి నిప్పంటించారు..
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ప్రేమించలేదన్న అక్కసుతో ఓ యువతిపై ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కేరళలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. ప్రస్తుతం 80 శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో ఈ ఘటన జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళలోని కుంబానాడ్ ప్రాంతానికి చెందిన అజిన్ రేజి మ్యాథ్యూ (20) అనే యువకుడు టాటా మెడికల్ సైన్సెస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న కవిత విజయ్‌కుమార్ (18) అనే విద్యార్థిని ప్రేమించసాగాడు. కానీ, ఆ విద్యార్థిని మాత్రం మ్యాథ్యూను దూరంగా ఉంచసాగింది. దీంతో ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామంటూ కవితను వేధించసాగాడు. పలు విధాలుగా బెదిరించాడు. అయినా నిరాకరించింది.
దీంతో ఆగ్రహించిన మ్యాథ్యూ రెండు బాటిళ్లలో పెట్రోల్ నింపుకుని కవితతో గొడవకు దిగాడు. చివరకు పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.