గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే.. సర్వశుభాలే..
గాయత్రీ మంత్రాన్ని పఠించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ మంత్రాన్ని అందరూ జపించవచ్చు. సర్వశుభాలను ప్రసాదించే గాయత్రి మంత్రాన్ని రోజుకు రెండుసార్లు లేదా సమయం దొరికినప్పుడల్లా ఉచ్చరించడం ద్వారా అభీష్టాలు నెరవేరుతాయి. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ప్రాణశక్తి పెరిగి ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది.
ఈ మంత్రాన్ని ఉచ్చరించడమే కాకుండా.. వినడం ద్వారానూ సకల సంతోషాలు చేకూరుతాయి. ఈ జన్మలో తెలిసీ తెలియకుండా చేసిన పాపాలను గాయత్రీ మంత్రం తొలగిస్తుంది. గాయత్రి అనే మంత్రానికి సావిత్రి అని కూడా పేరుంది. ఈ మంత్రం ఉదయం గాయత్రిగానూ, మధ్యాహ్నం సావిత్రిగానూ, సాయంత్రం పూట.. సంధ్యాసమయంలో సరస్వతిగా పూజించబడుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించిన తర్వాత ఇతర మంత్ర పఠనాలు జరుగుతున్నాయి. మంత్ర పఠనంలో గాయత్రీకే అగ్ర తాంబూలం.
"ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్''
పవిత్ర గాయత్రి మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జపించినా లేదా విన్నట్లైతే ఆ మంత్రం నుండి వెలువడే ధ్వని తరంగాలు మన మనసుని, శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి తద్వారా మనోబుద్ధి వికసిస్తుందని పండితులు సూచిస్తున్నారు.