శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 జులై 2019 (21:12 IST)

జూలై 12: శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి విశిష్టత... ఏం చేయాలో తెలుసా?

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశినే శయనైకాదశి అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. 
 
ఈ పర్వదినాన ''గోపద్మ వ్రతం'' ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ''చాతుర్మాస్య వ్రతం'' అవలంబిస్తారు. ఏకాదశినాడు ఉపవసించి, మరుసటి రోజు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. 
 
గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేవని భవిష్య, స్కంద పురాణాలను బట్టి తెలుస్తోంది. అందుకే ఏకాదశి రోజున వ్రతమాచరిస్తే.. సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. 
 
కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకారపూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో వెయ్యేళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో, సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ని సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకొమ్మన్నాడు. ఆమె- ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటి నుంచే ''తొలి ఏకాదశి'' వ్యవహారంలోకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి.
 
దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్తి పరాయణుడయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి, నియమ నిష్ఠలతో ఉపవసించి, విష్ణు సాయుజ్యం పొందాడంటారు. దుర్భర దారిద్య్రంలో మగ్గిన కుచేలుడు ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడని చెబుతారు. అందువల్ల అతడు సిరిసంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడంటారు.
 
ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని స్మృతి పురాణాన్ని బట్టి  తెలుస్తోంది.
 
గో పద్మ వ్రతం గురించి.. 
తొలి ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు చాతుర్మాస దీక్షలను పాటిస్తుంటారు. ఇంకా ఆషాఢ ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ద్వాదశి వరకు గోపద్మ వ్రతం ఆచరించే వారికి శ్రీ మహావిష్ణువు కోరిన కోర్కెలను నెరవేరుస్తాడని విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించని మహిళలను యమధర్మరాజు శిక్షిస్తాడని పద్మపురాణం చెబుతోంది. 
 
ఈ వ్రతం ప్రకారం నాలుగు నెలల పాటు శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. తొలి ఏకాదశి నుంచి ఇంటిల్లాపాదిని శుభ్రం చేసుకుని అలికి ముగ్గులు పెట్టాలి. ప్రత్యేకంగా బియ్యపు పిండితో ముఫ్పై మూడు పద్మాలను తీర్చిదిద్ధి గంధ పుష్పాలతో శ్రీహరిని పూజించి ప్రదక్షిణ నమస్కారించాలి. 33 అప్పాలను వేద పండితులకు వాయనం ఇవ్వాలి. 
 
గ్రామీణ ప్రజలైతే పశువుల కొష్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నాలుగు మాసాలు పరిశుభ్రతతో మహావిష్ణువును పూజించి, కార్తీక శుక్ల ద్వాదశి నాడు నారాయణ స్వామిని నిష్టతో పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఈ నాలుగు నెలల పాటు విష్ణుమూర్తిని అర్చించి, లీలా విశేషాలు, పురాణ పఠనం వల్ల అష్ట కష్టాలు తొలగిపోయి, సిరిసంపదలు చేకూరుతాయి. 
 
మరోవైపు నాలుగు నెలల పాటు మహావిష్ణువు జల శయనం చేయడం వల్ల విష్ణు తేజం నీటిలో వ్యాపించి ఉంటుంది. అందుకే చాతుర్మాస్యం (నాలుగు నెలలు) చేసే నదీ స్నానం శుభ ఫలితాలను ఇస్తుంది. నదికి వెళ్లి స్నానం చేయలేని వారు దగ్గరలో ఉన్న నది, చెరువు లేదా బావుల్లో భక్తిపూర్వకంగా స్నానం ఆచరించి పుణ్య ఫలాన్ని పొందవచ్చు. ఇంకా చాతుర్మాస్య ప్రారంభం, సమాప్తం సమయాల్లో విష్ణు భగవానునికి అతి ప్రీతికరమైన ఏకాదశుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు.
 
ఆషాడే తు సితే పక్షే ఏకదశ్యా ముషోషిత:
చాతుర్మాస్యవ్రతంకుర్యా ద్యత్కించి న్నియతో నరః
వార్షికాం శ్చుతురో మాసా న్వాహ యేత్కేనచి న్నరః
ప్రవతేన నోచే దాప్నోతి కిల్బిషం వత్సరోద్భవమ్.
అని చాతుర్మాస్య దీక్షా ప్రశస్తిని గురించి స్కాంద, భవిష్యోత్తరాది పురాణములో తెలుపబడి ఉంది. 
 
గృహస్థులైన శ్రీహరి భక్తులు ఈ నాలుగు మాసాలు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కామక్రోధాదులను వీడి, ఒంటిపూట భోజనము చేస్తూ దీక్షతో శ్రీహరిని ఆరాధిస్తే అశ్వమేథయాగఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.