శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By దీవి రామాచార్యులు (రాంబాబు)
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:15 IST)

లంకా దహనం: రావణుని తేజస్సుపై హనుమంతుడి ప్రశంస.. అధర్మమే లేకున్నచో..?

హనుమంతుడు సీత ఇచ్చిన చూడామణిని తీసుకుని పోతూ లంకా పట్టణాన్ని ఒక్కసారి చూసి పోదామని లంక అంతా తిరిగి చివరికి రావణుని ఉద్యానవనమును ధ్వంసం చేశాడు హనుమంతుడు. ఆ వార్త రాక్షసుల ద్వారా తెలిసికొని రావణుడు హనుమంతుని పట్టుకుని తీసుకుని రమ్మని కింకరులను పంపాడు. హనుమంతుడు వాళ్ళనందరినీ సంహరించి చివరకు ఇంద్రజిత్తుతో యుద్ధము చేసి అతని అస్త్రములకు కట్టుబడి రావణుని సభలోకి వెళ్ళెను.
 
అక్కడ రావణుని చూసి ''ఆహా! ఏమి ఈ రావణుని రూపము. ఏమి ధైర్యము. ఏమి బలము. ఏమి కాంతి. ఏమి సర్వలక్షణ సంపన్నత్వము. ఇతనిలో బలవత్తరమైన ఈ అధర్మమే లేకున్నచో ఈ రాక్షసరాజు ఇంద్రునితో సహా దేవలోకానికి ప్రభువు అయి వుండేవాడు అని హనుమంతుడు రావణుని తేజస్సు చూసి మోహము చెంది మనస్సులో ఇలా అనుకున్నాడు. మంత్రి ద్వారా రావణుడు హనుమంతుని గురించి తెలుసుకుంటాడు. తర్వాత హనుమంతుడు రాముని ప్రభావము వర్ణించి అతని బలపరాక్రమములను గురించి చెబుతూ రావణునకు నీతిని బోధిస్తాడు. 
 
రావణుడు కోపంతో హనుమంతుని తోకకు నిప్పంటించి లంకా నగరములో త్రిప్పిస్తాడు. ఆ విషయాన్ని కొంతమంది రాక్షసస్త్రీలు పోయి సీతకు చెప్పారు. రావణుడు సీతను అపహరించినప్పుడు ఎంత దుఃఖము చెందినదో అంత దుఃఖమును కలిగించే వార్తను విన్న వెంటనే సీత అగ్నిని హనుమంతునికి ఎటువంటి ఆపద కలుగకుండా చూడమని ప్రార్థించెను. హనుమంతుడు లంకను తగులబెట్టి తన తోకకు అంటుకున్న అగ్నిని చల్లార్చుకుని తిరిగి ఒకసారి సీత వున్న అశోకవనానికి వెళ్ళి అక్కడ సీత క్షేమముగా వున్నదని చూసి లంకను వదిలిపెట్టి రాముడి వద్దకు బయలుదేరెను. _ ఇంకా వుంది.