సుదర్శన అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించినది. "సు" అనగా "మంచి లేదా శుభకరమైనది", "దర్శన"కి అర్థం "చూపు, దృష్టి, ధర్మము" అని పదకోశములో చెప్పబడినది. "చక్రము"కి అర్థము "గుండ్రనిది, గడి లేదా రక్షణ కంచె" అని ఉన్నది. కావున ఈ పదాలను క్రోడీకరించినట్లయిన మంచిని చూపే గడి, శుభకరమైన దృష్టిగల చక్రము, ధర్మపు రక్షణ కంచెలో ఉంచేది అని వ్యుత్పత్యర్థాలు చెప్పుకొనవచ్చు.
అహిర్బుద్న్య సంహిత ప్రకారం సుదర్శన చక్రం సర్వ శక్తి వంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుని సంకల్పం ప్రకారం పనిచేస్తుంది. ఇది చెడును అంతమొందించి మంచిని స్థిరపరిచే అస్త్రంగా పేర్కొనబడినది. అహిర్బుద్న్య సంహిత అనేది పంచరాత్ర సంప్రదాయానికి చెందిన వైష్ణవ గ్రంధం. సుదర్శన చక్రం అనే మహిమాన్విత దివ్య చక్రం విష్ణువు యొక్క నాలుగు చేతులలో కుడి వెనుక చేతిలో చిత్రీకరించబడినది. ఋగ్వేదములో ఈ మహిమాన్విత ఆయుధం విష్ణువు యొక్క రూపముగా, కాల చక్రంగా చెప్పబడినది.
ఆవిర్భావము:
పురాణాల ప్రకారం సుదర్శన చక్రాన్ని దైవ శిల్పి విశ్వకర్మ రూపొందించాడని ఉన్నది. విశ్వకర్మ యొక్క కుమార్తె అయిన “సంజ్ఞ” సూర్య దేవుని వివాహము చేసుకున్నదని, అయితే సూర్యుని యొక్క వేడిమి వలన ఆమె సూర్యుని చెంతకు చేరలేకపోవడంతో, విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి పుష్పక విమానము, త్రిశూలము, సుదర్శన చక్రాన్ని ఉత్పత్తి చేసెనని ఉన్నది. రామాయణంలో కూడా సుదర్శన చక్రాన్ని విశ్వకర్మ తయారు చేసినట్లు ఉన్నది.
శివపురాణంలోని కోటి యుద్ధ సంహిత ప్రకారం విష్ణువు కొరకు శివుడు సుదర్శన చక్ర సృష్ఠి గావించెనని ఉన్నది. దుష్టశిక్షణ చేయుటకై విష్ణువుకు ఆయుధము అవసరమై శివుని పూజించెనని, ఆ పూజలో శివుని సహస్ర నామాలతో స్తుతిస్తూ, ప్రతీ నామానికి ఒక తామర పుష్పం సమర్పిస్తుండగా, శివుడు ఒక పుష్పాన్ని తప్పించెనని, పూజలో ఒక పుష్పం తక్కువగుటచేత, విష్ణువు పుష్పమునకు బదులుగా తన నేత్రమును సమర్పించెనని, అంత విష్ణువు భక్తికి మెచ్చి శివుడు అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రమునిచ్చెనని వివరించబడినది. విష్ణుపురాణాన్ని అనుసరించి, విష్ణువు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయగా శివుడు సుదర్శన చక్రాన్ని ప్రసాదించినట్లు కధనం ఉంది.
ప్రస్థానం:
దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకొనగా, దుఃఖితుడైన శివుడు, ఆమె నిర్జీవ దేహాన్ని భుజాన వేసుకొని తిరుగుతూ ఉంటే, ఆతనిని బాధ నుండి విముక్తుడ్ని చేయడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించి, సతీదేవి దేహాన్ని ఏభై ఒక్క ముక్కలుగా ఖండిచగా, ఆ శరీర భాగాలు భూమిపై వివిధ ప్రదేశాలలో పడి, శక్తిపీఠాలుగా ఆవిర్భవించాయని పురాణాలు తెలియజేస్తున్నాయి. సముద్రమధన సమయములో రాహువు యొక్క శిరస్సును ఖండించడానికి, దివ్య మందర పర్వతాన్ని నరికి వేయడానికి కూడా శ్రీ మహా విష్ణువుకు ఉపయోగపడిందని ఐతిహాసకులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు పరశురామునికి అప్పగించగా, తరువాత అది శ్రీక్రృష్ణ భగవానుని చేరినది.
లక్షణాలు:
మహాభారతం 16వ అధ్యాయము నందు సుదర్శన చక్రము యొక్క వర్ణన ఉన్నది. ఇది శత్రువులను అగ్నివలె దహించి వేస్తుంది. శత్రు సంహరణార్థం విష్ణుభగవానుడు సుదరర్శన చక్రమును ప్రయోగించిన ఎడల, అది సూర్యతేజోవిరాజితమయి, శత్రు సంహారము చేసి తిరిగి భగవానుని చెంత చేరుతుంది. శ్రీహరి నామస్మరణ చేస్తూ విష్ణు భగవానుని శరణు వేడు కొనుట ఒక్కటే దీని బారినుండి తప్పించుకును మార్గము. అలా కాని యెడల అది శత్రు సంహారం చేయకుండా తిరిగి మహావిష్ణువును చేరడం జరగదు. ఈ దివ్య చక్రానికి 108 మొనలు ఉండి, రెప్పపాటులో కొన్ని మిలియన్ యోజనాల దూరం ప్రయాణిస్తుంది.
సుదర్శన మంత్రాలు:
సుదర్శనుడిని(సుదర్శన చక్రాన్ని) పూజించడానికి ఉపయోగపడే కొన్ని మంత్రాలు
1)శ్రీ సుదర్శన షడక్షరీ మంత్రం
ఓం సహస్రార హుం ఫట్
2)సుదర్శన గాయత్రీ మంత్రం.
ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి
తన్న శ్చక్రః ప్రచోదయత్
3)శ్రీ సుదర్శన మూల మంత్రం.
ఓం శ్రీం హ్రీం క్లీం
కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ
పరాయ పరమపురుషాయ పరమాత్మనే
పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషద- అస్త్రశస్త్రాణి
సంహార సంహార, మృత్యోర్మోచయ మోచయ.
ఓం నమో భగవతే మహా సుదర్శనాయ
దీప్త్రే జ్వాలా పరీతాయ సర్వదిక్షోభణకరాయ
హూం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రార హుం ఫట్ (స్వాహా).
ఈ శ్లోకం సుదర్శన హోమం వద్ద చదివినచో “స్వాహా”కారం చదువ వలెను. జపం చేసుకొను సమయమున “స్వాహ”కారం పరనికరాదు. పూర్తి నియమనిష్ఠలు పాటించ లేనివారు "ఓం సుదర్శన చక్రాయ నమః" అని చెప్పుకొనవచ్చు. మంత్ర జపం సమయంలో పాటించవలసిన ముఖ్యమైన నియమములు:
1)శుభ్రమైన స్థలంలో కూర్చొనవలెను.
2)మంత్రాన్ని 3,9,11,21,108 లేదా మీకవకాశమున్నన్నిసార్లు జపించవచ్చు.
3) మంత్రజపం సమయంలో భగవంతునిపై మనస్సును లగ్నము చేయవలెను.
పూజా ఫలము:-
ఒకానొక సందర్భమున శివపార్వతులు కైలాసమున రత్న సింహాసనముపై ఆశీనులై ఉన్న సమయమున, పార్వతీదేవి శివ దేవునితో "ఏ మంత్రం జపించుట వలన కార్యసిద్ధి కలుగును" అని ప్రశ్నించగా," సుదర్శన మంత్రానికి అంతటి శక్తి ఉన్నది" అని సెలవిచ్చెనట. సుదర్శన మంత్రపఠనం వలన ఆయురారోగ్యములు మెరుగుపడును. శత్రు భయం ఉన్నయెడల సుదర్శన ఆరాధన వలన శత్రు వినాశనం జరుగును. ఈ పూజ శత్రువులు సంధించిన అస్త్ర, శాస్త్ర, మంత్ర, తంత్రాల నుండి రక్షిస్తుంది.
-కె. వెంకటరాజు