శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Modified: సోమవారం, 14 మార్చి 2016 (18:00 IST)

తిరుమల తుంబుర తీర్థంలో శ్రీవారి సాక్షాత్కారం... 23న తుంబుర తీర్థ స్నానాలు... టిటిడి ఏర్పాట్లు

తిరుమలలోనే  ఎంతో ప్రసిద్ధి చెందిన తీర్థాల్లో ఒకటైన తుంబుర తీర్థాన్ని ఈ నెల 23వ తేదీన టిటిడి తెరవనుంది. సంవత్సరానికి ఒకమారు మాత్రమే తెరిచే ఈ తుంబుర తీర్థానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. పౌర్ణమి గడియల్లో మాత్రమే తుంబుర తీర్థాన్ని తెరుస్తారు. తిరుమలకు ఉత్తరం వైపున తుంబుర తీర్థం ఉంది. తిరుమల నుంచి తొమ్మిది కిలోమీటర్లు అడవుల గుండా నడిచి వెళ్ళాలి. తుంబుర తీర్థం ప్రాశస్త్యం ఏమిటంటే శ్రీనివాసునిపై పాటలు పాడేందుకు నారదుడు, తుంబురుడు తుంబుర తీర్థం సమీపంలో పోటీ పడతారు.
 
అయితే నారదుడు స్వామివారిపై అనర్గళంగా గీతాలు పాడడంతో తుంబురుడు వెనక్కి తగ్గి ఆ తీర్థంలోనే కూర్చుండి పోతారు. అప్పుడు వేంకటేశ్వర స్వామి ఆ ప్రాంతానికి వచ్చి తుంబురుడిని బుజ్జగిస్తారు. దీంతో ఆ తీర్థానికి తుంబుర తీర్థం అనే పేరు వచ్చింది. మరోవైపు తరిగొండ వెంగమాంబకు తుంబుర తీర్థంలో స్వామివారు సాక్షాత్కరించారని ప్రసిద్ధి. అంతే కాకుండా ఈ తీర్థంలో కొండలు రెండుగా చీలి ఉంటాయి.
 
తుంబుర తీర్థంలో స్నానమాచరిస్తే ఎంతో మంచిదన్నది భక్తుల నమ్మకం. దీంతో ప్రతి యేటా వేలాదిగా తుంబుర తీర్థానికి భక్తులు తరలివస్తారు. ఈమారు కూడా లక్షల్లో భక్తులు తరలివస్తారని టిటిడి అధికారులు అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.  ఏర్పాట్లపై తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుంబుర తీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు. లక్ష ప్యాకెట్ల తాగునీరు, 60 వేల ప్యాకెట్ల మజ్జిగ పంపిణీకి టిటిడి ఏర్పాట్లు చేస్తోంది. 
 
గతంలో భక్తులు తీసుకువచ్చిన వంట సామగ్రితో అగ్నిప్రమాదం జరగడంతో అలాంటివి తిరిగి పునరావృతం కాకుండా ఉండానే ఉద్ధేశంతో భోజన సదుపాయాన్ని కూడా టిటిడి కల్పించనుంది. అలాగే అటవీ మార్గంలో భక్తుల భద్రతా చర్యలపై రేడియో బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగం ద్వారా నిరంతరం ప్రకటనలు టిటిడి చేయనుంది. రేణిగుంట వైపు వెళ్ళే కరకంబాడి నుంచి తుంబుర తీర్థానికి భక్తులు వెళ్ళకూడదని, పాపవినాశనం మార్గంలోనే వెళ్ళాలని భక్తులకు సమాచారాన్ని టిటిడి అందించనుంది. దారిపొడువునా పోలీసులను, టిటిడి సిబ్బందిని భద్రత కోసం నియమించనున్నారు. భక్తుల సౌకర్యవంతంగా, సులువుగా గమ్యస్థామానికి చేరుకునేలా ఒకచోట నుంచి మరో చోటుకు మార్చుకునేలా పటిష్టమైన నిచ్చెనలు అందుబాటులో ఉంచాలని అధికారులను జెఇఓ ఆదేశించారు.