మంగళవారం, 7 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By ttdj
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (13:26 IST)

500 యేళ్ళ నాడే తిరుమలలో అన్నదానం.. ఎవరు ప్రారంభించారంటే...

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ దాదాపు 80 వేల మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు కనులారా వీక్షిస్తున్నాం. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది తితిదే లక్ష్యం.

తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం తరలివస్తున్న భక్తులకు రోజూ దాదాపు 80 వేల మందికి ఉచితంగా భోజనం వడ్డిస్తున్న వైభవాన్ని నేడు కనులారా వీక్షిస్తున్నాం. తిరుమలలో ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది తితిదే లక్ష్యం. అందుకే ఏ సమయంలో భోజనానికి వెళ్ళినా దొరికే ఏర్పాటు చేశారు. ఉదయం అల్పాహారం కూడా అందుబాటులోకి తెచ్చారు. నేటి సంగతులు అందరికీ తెలిసినవేగానీ తిరుమలలో అన్నదానానికి 500 యేళ్ళ క్రితమే పునాది పడిందనే సంగతి చాలా మందికి తెలియదు. 
 
మొదట చంద్రగిరి ప్రభువుగా, ఆపై విజయనగర రాజుగా క్రీ.శ.1450 నుంచి క్రీ.శ.1493 నుంచి 44 యేళ్ళపాటు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సాలువ నరసింగరాయలు కూడా శ్రీవారి భక్తుడు. ఆయన హయాంలోనే తిరుమల, తిరుపతిలో ఉచిత భోజనశాలలు ఏర్పాటు చేశారు. వీటికి రామానుజ కూటములు అని పేరు పెట్టారు. ఈ కూటముల్లో శ్రీ వైష్ణవులకు మాత్రమే భోజనం పెట్టే ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను కందాడై రామానుజాచార్యులకు అప్పగించారు. కూటములకు అయ్యే ఖర్చులకుగాను భూములను దానంగా ఇచ్చారు. దాతలనూ ఏర్పాటు చేశారు. 
 
సాళువ నరసింగరాయలు తిరుమలలో బ్రాహ్మణేతరుల కోసం ఒక భోజనశాల ఏర్పాటు చేశారు. దీనికి సత్రం అని పేరు పెట్టారు. ఆలయాన్ని అభివృద్థి చేసే క్రమంలో సత్రం కనుమరుగైంది. రామానుజ కూటముల నిర్వహణకుగాను పేరూరు గ్రామానికి ఈశాన్య దిక్కున తిరుపతికి పడమటన ఉన్న భూములను అప్పగించారు. ఈ భూములకు పేరూరు చెరువు నుంచి నీటి కాల్వలు కూడా త్రవ్వించారు. తిరుపతిలో నరసింహతీర్థం వద్ద రామానుజ కూటమి, సత్రం ఏర్పాటు చేసి భోజన వసతి కల్పంచారు. సత్రాల నిర్వహణకు ఐదు గ్రామాలను 1468, మార్చి 16న శ్రీవారికి సమర్పించారు. గంగురెడ్డిపల్లె గ్రామానికి ఒక దాత సత్రం నిర్వహణ కోసం దానంగా ఇచ్చారు.
 
తిరుమలలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలో ప్రసాదాలూ వడ్డించేవారు. సాళువ నరసింహరాయలు శ్రీవారి ఆలయంలో 30 సంధి పూజల నైవేద్యం ఏర్పాటు చేశారు. ఈ ప్రసాదాలలో గృహస్తు భాగంగా వచ్చే ప్రసాదాన్ని సత్రాలకు పంపి ఉచిత భోజనంతో పాటు వడ్డించే ఏర్పాటు చేశారు. వాస్తవంగా చోళుల కాలంలోనే తిరుమలలో అన్నదాన కార్యక్రమం మొదలైందని చెప్పాలి. అంటే క్రీ.శ.905, క్రీ.శ.953 కాలంలో ఇద్దరు బ్రాహ్మణులకు నిత్య అన్నదానం స్వామివారి సన్నిధిలో జరిపించడానికి ఇరుంగోలన్‌ రాజైన ఇరుంగోలంకన్‌ అనే గుణవన్‌ అపరాజితన్‌ ఏర్పాటు చేసినట్లు శాసనాల్లో ఉంది. ఇందుకు అవసరమయ్యే బంగారాన్ని ఆయన దేవస్థానం అధికారులకు అప్పజెప్పారు. ఈ లెక్కన చేస్తే తిరుమలలో అన్నదానం ఆలోచన మొదలై దాదాపు వెయ్యి యేళ్లు అవుతుందని చెప్పాలి.
 
ఆ తర్వాత 18వ శతాబ్థంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదాన పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నృసింహ జయంతిని పురస్కరించుకుని పదిరోజుల పాటు తిరుమలకు వచ్చే భక్తులకు వెంగమాంబ అన్నదానం చేసేవారు. అప్పట్లో ఉత్తరాన గోల్కొండ నుంచి దక్షిణాన తమిళనాడులోని దిండిగల్‌ వరకు ఉన్న ఆంధ్రులు తిరుమల సందర్శనానికి వచ్చినప్పుడు అన్నదానం నిమిత్తం వెంగమాంబకు దానపత్రాలున్నాయి. అప్పటి సంస్థానాదీశులు, జమిందార్లు, పాళేగాళ్లు, వర్తకులు, రైతులు, సామాన్య ముస్లిం సోదరులు అన్నదానానికి విరాళాలు ఇచ్చారు. ఆధునిక కాలంలో 1983 ఏప్రిల్‌ 6వ తేదీన తిరుమలలో నిత్యాన్నదాన పథకానికి తితిదే శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రోజుకు 80 వేల మందికి అన్నప్రసాదాలు అందజేస్తున్నారు. ఒకప్పుడు దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు మాత్రమే, అదీ మధ్యాహ్నం రాత్రి వేళల్లో పరిమిత సంఖ్యలో భోజనం వడ్డించేవారు. ఆపై టోకెన్‌తో నిమిత్తం లేకుండా ఎవరు వెళ్ళినా భోజనం వడ్డించేలా నిర్ణయం చేశారు. ఇటీవల కాలంలో ఉదయం పూట అల్పాహారం కూడా భక్తులకు అందిస్తున్నారు.