పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం.. టిక్కెట్ ధర రూ.1000
తిరుపతి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి నేరుగా లేదా వర్చువల్‌గా పాల్గొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు భక్తులకు అవకాశం కల్పించారు. ఇందుకోసం ఆగస్టు 18వ తేదీన ఆన్‌లైన్‌లో టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.
పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 25వ తేదీన శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలోని ఆస్థాన మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతీ అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
వరలక్ష్మీ వ్రతంలో నేరుగా పాల్గొనాలని కోరుకునే భక్తులకు ఆగస్టు 18వ తేదీన ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. ఆగస్టు 24న ఉదయం 9 గంటలకు ఆలయం వద్ద ఉన్న కుంకుమార్చన కౌంటర్‌లో కరెంట్ బుకింగ్ ద్వారా మరో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000 చెల్లించి భక్తులు టికెట్ కొనుగోలు చేయవచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.
అలాగే, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వర్చువల్ విధానంలో భక్తులు పాల్గొనేందుకు వీలుగా ఆగస్టు 18న ఉదయం 9 గంటలకు టిటిడీ ఆన్‌లైన్‌లో టికెట్లను విడుదల చేయనుంది. వర్చువల్ టికెట్లు పొందిన భక్తులకు ఆగస్టు 26వ తేదీ నుంచి 90 రోజుల్లోపు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 25న అమ్మవారికి అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రేక్ దర్శనం, వేద ఆశీర్వచనం సేవలను రద్దు చేసినట్లు తితిదే తెలిపింది.