గురువారం, 14 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (17:48 IST)

సూర్యనారాయణుడి పరిహార క్షేత్రం.. ఇక్కడ నవగ్రహాలకు వాహనాలుండవ్..

నవగ్రహాల్లో సూర్యదేవునిది ప్రత్యేకమైన స్థానం. సమస్త జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తూ జీవ వైవిధ్యాన్ని నెలకొల్పుతాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదటిగా సూర్యభగవానుడిని ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి నెలవైన పవిత్ర క్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌. ఈ ఆలయానికి స్థలపురాణం ఉంది. 
 
పూర్వం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు వ్యాధి నుండి విముక్తి కలిగించమని నవగ్రహాలను వేడుకున్నాడు. అందుకు గ్రహాధిపతులు అనుగ్రహించి వ్యాధి నివారణ చేసారు. దాంతో సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆగ్రహం వచ్చింది. గ్రహాలు మానవుల్లో మంచి చెడులకు సంబంధించిన ఫలితాలు ఇవ్వాలే కానీ ప్రకృతి విరుద్ధ కార్యాలు చేయకూడదని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించినందుకు భూలోకంలో శ్వేత పుష్పాల అటవీ ప్రాంతానికి వెళ్లిపొమ్మని శపించాడు. 
 
దాంతో భూలోకానికి చేరుకున్న నవగ్రహాలు శాప విముక్తి కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేసారు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు శాప విమోచనం కలిగించి, వరాన్ని కూడా ఇచ్చాడు. వారు తపస్సు చేసి అనుగ్రహం పొందిన స్థలానికి వచ్చి సమస్యలు ఉన్నవారు నవగ్రహాలను ప్రార్థిస్తే వారి సమస్యలు తీరుతాయని వరాన్ని ప్రసాదించాడు. 
 
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకంగా గుళ్లున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. సూర్యదేవుడు ఇక్కడ మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్త జన కోటికి ఆశీర్వచనాలు ఇస్తాడు. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. 
 
నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించవు. గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా ఉన్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన తదితర పూజలు నిర్వహిస్తారు.

తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.