బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 మార్చి 2021 (13:31 IST)

శ్రీనివాసమంగాపురంలో శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన‌లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్-19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.
 
ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అనంత‌, గ‌రుడ‌, విష్వక్సేనుల వారిని, గ‌రుడ ప‌టాన్ని ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగింపుగా ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌కు తీసుకొచ్చారు. వేద మంత్రాల న‌డుమ ధ్వ‌జ‌స్తంభానికి పూజ‌లు చేశారు. 
 
అనంత‌రం మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా  ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ బాలాజి రంగాచార్యులు కంకణబట్టార్‌గా వ్య‌వ‌హ‌రించారు.
 
కోవిడ్ నేప‌థ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి 
శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ఈ ఆల‌యం చాలా చ‌రిత్ర గ‌ల‌ద‌ని, విజ‌య‌న‌గ‌ర‌రాజులు, అన్న‌మాచార్య వంశీకులు ఈ ఆల‌యాభివృద్ధికి ఎంతో స‌హ‌కారం అందించార‌ని శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. 
 
ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, మార్చి 6న గ‌రుడ‌సేవ జ‌రుగ‌నుంద‌ని, మార్చి 10న ధ్వ‌జావ‌రోహ‌ణంతో ఈ ఉత్స‌వాలు ముగుస్తాయ‌ని తెలిపారు. లోక‌క‌ల్యాణం కోసం నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాల‌తో అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.
 
భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూలు 
ఈ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 9 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూల‌ను ఆల‌యంలో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. రోజుకు 3 వేల చొప్పున ల‌డ్డూలను భ‌క్తుల‌కు విక్ర‌యిస్తారు.
 
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గవి, ఎస్ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయులు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.