తిరుమలలో తితిదే జెఈఓ ఆకస్మిక తనిఖీలు
తితిదే జెఈఓ శ్రీనివాసరాజు తిరుమలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన జెఈఓ శ్రీనివాసరాజు కంపార్టుమెంట్ లో వేచి ఉన్న భక్తులతో మాట్లాడారు. భక్తులకు అందుతున్న సౌకర్యాలపై స్వయంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. కంపార్టుమెంట్‌లో వేచి ఉన్న భక్తులను త్వరితగతిన క్యూలైన్ల నుంచి దర్శనానికి పంపాలని అధికారులను ఆయన ఆదేశించారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని కూడా జెఈఓ తనిఖీ చేశారు.
ఘనంగా పద్మావతి దేవి వార్షికోత్సవాలు
తిరుచానూరు శ్రీ పద్మావతి వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సూర్యభగవానుడు వసంత బుతువులో, మేషరాశిలో ఎక్కువ ప్రకాశవంతంగా ఉండడంతో మానవులు వ్యాధి బాధలు కలుగుతాయని లోకమాత అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధనం చేయడం వల్ల శారీరక, మానసిక తాపాలు తొలగుతాయని అర్చకులు తెలిపారు.
వసంతోత్సవాల్లో భాగంగా సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర్త నామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం రెండు గంటలకు అమ్మవారి ఉత్సవర్లను అమ్మవారి ఆలయం నుంచి శుక్రవారపు తోటపు వూరేగింపుగా తీసుకెళ్ళారు. సాయంత్రం 3 గంటల నుంచి 4.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6.30గంటల నుంచి 7గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.