మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (12:41 IST)

తెలంగాణ పోల్స్ : పోటీ త్రీస్టార్.. ప్రచారం మల్టీస్టార్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ డిసెంబరు 7వ తేదీన జరుగనుంది. అంటే ప్రచారం కోసం కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో ప్రధాన పార్టీల తరపున బరిలోకి దిగిన అభ్యర్థులు ఇపుడు ప్రచారంపై దృష్టిసారించారు. 
 
నిజానికి ఈ దఫా తెలంగాణ ఎన్నికల్లో సినీ రంగానికి చెందిన వ్యక్తులు కేవలం ముగ్గురంటే ముగ్గురు మాత్రమే పోటీ చేస్తున్నారు. కానీ, వీరి కోసం ప్రచారం చేసేందుకు అనేక మంది స్టార్స్ తరలిరానున్నారు. 
 
ఈ ఎన్నికల్లో టాలీవుడ్‌కు చెందిన బాబూ మోహన్, వేణు మాధవ్, రేష్మా రాథోడ్ (ఈరోజుల్లో నటి) బరిలోకి దిగుతున్నారు. అలాగే, ప్రముఖ నిర్మాత, భవయ క్రియేషన్స్ అధినేత ఆనంద ప్రసాద్ కూడా టీడీపీ తరపున షేరింగంపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. 
 
అయితే, ఈయనను స్టార్‌ కేటగిరీలోకి తీసుకోలేం. దీంతో తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు మాత్రమే పోటీ చేస్తున్నారు. వీరికోసం టీడీపీ తరపున బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌, తారకరత్న వంటి హీరోలు ప్రచారం చేయనున్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి, ఖుష్బూ, నగ్మాలు ప్రచారం చేయనున్నారు. వీరితో పాటు.. చిరంజీవి కూడా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. నిజానికి రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది నటీనటులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకే పరిమితమం కావడంతో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసే స్టార్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.