నందమూరి కుటుంబాన్ని ఏకం చేసిన సుహాసిని
రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత నందమూరి హరికృష్ణ తనయ నందమూరి వెంకట సుహాసిని తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈమె హైదరాబాద్ కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహాకూటమి తరపున ఆమె ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈమె ఎంపికలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఫలితంగా ఇపుడు నందమూరి కుటుంబమంతా ఏకమైంది. సుహాసినికి మద్దతుగా ప్రచారం చేసేందుకు నందమూరి హీరోలు సంసిద్ధులవుతున్నారు.
నిజానికి గత కొంతకాలంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. అయితే, నందమూరి హరికృష్ణ మరణంతో వీరింతా ఏకమయ్యారు. అయినప్పటికీ వారి మధ్య మనస్పర్థలు మాత్రం తొలగిపోలేదు. ఈ క్రమంలో కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం టీడీపీ అభ్యర్థిగా సుహాసిని పేరును చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నిర్ణయమే నందమూరి కుటుంబంలో కీలక మలుపు తిప్పింది.
గత 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున సుహాసినికి మద్దతుగా ప్రచారం చేయబోతున్నాడు. అలాగే, మరో హీరో కల్యాణ్ రామ్ కూడా అక్కకు మద్దతుగా ప్రచారానికి రానున్నాడు. మరోపక్క, బాలకృష్ణ ప్రచారానికి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే తారకరత్న ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైవున్నాడు.
నిజానికి కూకట్‌పల్లి నుంచి తొలుత కల్యాణ్ రామ్‌ను బరిలోకి దింపాలని టీడీపీ భావించింది. అయితే, అందుకు అతడు నిరాకరించడంతో అకస్మాత్తుగా సుహాసినిని తెరపైకి తెచ్చారు. ఆమెతో మంచి సంబంధాలున్న చంద్రబాబు భార్య భువనేశ్వరి మాట్లాడి సుహాసినిని పోటీకి ఒప్పించారు. సుహాసిని నామినేషన్ రోజున బాలయ్య తోడుగా వెళ్లారు. సోదరిని గెలిపించుకుంటామని ఎన్టీఆర్, తారకరత్న, కల్యాణ్ రామ్ ఇప్పటికే ప్రకటించారు. సుహాసిని కారణంగా నందమూరి కుటుంబం ఒక్కటి కావడం ఎన్టీఆర్, టీడీపీ అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహంనింపింది.