బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (14:17 IST)

కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో తొంగుంటే.. గోటీలు ఆడుతాడు ఆయన మనవడు.. రేవంత్ కన్నీరు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రేవంత్ రెడ్డి మాటలతూటాలు పేల్చారు. కేసీఆర్‌ను, ఆయన కుమారుడు కేటీఆర్‌ను వ్యక్తిగత దూషిస్తున్నారంటూ తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన శనివారం హైదరాబాద్‌లో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీఆర్ పాలన సాగించారని ఆరోపించారు. 
 
నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల నినాదం అని, టీఆర్‌ఎస్‌ది కాదన్నారు. రాజకీయ మనుగడ కోసం ఈ నినాదాన్ని విస్తరింపజేసి ప్రజల భావోద్వేగాలను పార్టీ కోసం కేసీఆర్‌ వాడుకున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అలాగే స్వయం పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్‌ పాలనలో సామాజిక న్యాయం మచ్చుకైనా కనిపించలేదన్నారు. పటేల్‌, పట్వారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారని, కేసీఆర్‌ మార్క్‌ పాలనను ప్రజలపై రుద్దారని ఆయన అన్నారు. 
 
అంతేకాకుండా, నా ఒక్కగాని ఒక్క కుమార్తె నిశ్చితార్థానికి నన్ను రాకుండా అడ్డుకొని తండ్రీకొడుకులు పైశాచికానందం పొందాలనుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన కళ్ల వెంట నీరుకారాయి. సీఎం కేసీఆర్‌ సచివాలయానిరారు కానీ అతని మనవడు సచివాలయంలో గోటీలు ఆడతాడని, భద్రాచలం రాముడికి బడి పిల్లగాడితో పట్టువస్త్రాలు, తలంబ్రాలు ఇప్పించడం దారుణమన్నారు. 
 
సోనియా, రాహుల్‌పై కేసీఆర్‌ వ్యక్తిగతంగా దూషించడం హేయమని, సోనియాను అమ్మనా?... బొమ్మనా అనడం, రాహుల్‌ను బఫూన్‌ అనడం వ్యక్తిగత దూషణ కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్‌ను, ఆయన కుటుంబ సభ్యులను లేశమాత్రం కూడా తాము వ్యక్తిగతంగా దూషించలేదని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.